Share News

పేదల చెంతకు అంతర్జాతీయ స్థాయి విద్య

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:38 PM

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఒకేచోట అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించ నున్నది.

పేదల చెంతకు అంతర్జాతీయ స్థాయి విద్య
గతేడాది అక్టోబరు 11న శంకుస్థాపన చేస్తున్న ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ

- మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో పది గురుకులాలు

- 20 నుంచి 25 ఎకరాల స్థలంలో నిర్మాణం

- సకల సౌకర్యాలతో సమీకృత గురుకుల పాఠశాలలు

అచ్చంపేట, మార్చి 26, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఒకేచోట అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించ నున్నది. ఇందుకు యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాల నిర్మా ణానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడతలోనే 10 నియోజక వర్గాలలో ఈ గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో గురుకులానికి రూ. 200 కోట్లు కేటాయించింది. సమీకృత గురుకుల పాఠశాలలో ఐదు నుంచి ఇంటర్‌ వరకు చదువుకొనే వీలుంటుంది.

ఉమ్మడి జిల్లాలో 10 సమీకృత గురుకులాలు

మొదటి విడతలో యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజక వర్గాలకు గాను 10 నియోజకవర్గాలకు మంజూరు చేశారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల, మక్తల్‌, జడ్చర్ల, దేవరకద్ర, నియోజకవర్గాలలో గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉప్పునుంతల మండలం రాయిచేడ్‌, పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోల్‌, నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తి, తలకొండపల్లి మండలం కోనాపూర్‌ గ్రామాలలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల శంకుస్థాపన చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోల్‌ గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

అన్ని హంగులతో నిర్మాణాలు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు 20 ఎకరాల స్థలంలో రూ. 200 కోట్లతో నిర్మించనున్నారు. రాష్ట్రంలో నిర్మించనున్న సమీకృత గురుకులాలకు ఈ నెల 8న రూ.11 వేల కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Mar 26 , 2025 | 11:38 PM