పంటలు ఎండుతున్నాయ్..
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:36 PM
సాగునీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.

- సాగునీరందించాలని కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
- 16 గ్రామాల్లో 20 వేల ఎకరాలకు నీటి కొరత
- మరో 20 రోజులు సాగునీరు అందించాలి
గద్వాల న్యూటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సాగునీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద అలంపూర్ నియోజకవర్గంలోని 16 గ్రామాలలోని 20 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతు జనార్దన్‌గౌడు మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గంలోని సింధనూరు, కుట్కనూర్, తొత్తినోనిదొడ్డి, బైనపల్లి, కొత్తపల్లి, రాజాపురం, పులికల్, కిసాన్‌నగర్, తాండ్రపాడు, ఉప్పల, నౌరోజీక్యాంపు, వేణిసోంపురం, కేశపురం గ్రామాల రైతుల పొలాలు ఆర్డీఎస్ కెనాల్ కింద ఉన్నాయి. ఈ ఏడాది యాసంగి పంటకు 34వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆర్డీఎస్ కింద వివిధ రకాల పంటలు సాగుచేశారు. ప్రస్తుతం పంటలు ఎండుతున్నాయి. దీంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నామని తెలిపారు. పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ధర్నా విరమింపజేసేందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కలెక్టర్‌ను కలిసేదాకా కదిలేది లేదని భీష్మించుకు కుర్చున్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి మరో 20 రోజులు సాగునీరు విడుదల చేస్తే తప్ప పంటలు చేతికందే పరిస్థితి కనిపించడం లేదని, సాగునీరు విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు రంగన్న, సవారన్న, రమేష్, ఆంజనేయులు, బుడ్డన్న తదితరులు ఉన్నారు.