Share News

అకాల వర్షం..అపార నష్టం

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:37 PM

వనపర్తి జిల్లాలో అకాల వర్షానికి 453 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

అకాల వర్షం..అపార నష్టం
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో దెబ్బతిన్న వరి పైరును పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

- అల్లమాయపల్లి శివారులో వడగండ్ల వాన

- వనపర్తి జిల్లాలో 453 ఎకరాల్లో పంట నష్టం

- ఖిల్లాఘణపురం మండలంలో 123 ఎకరాలు, కొత్తకోట మండలంలో 330 ఎకరాల్లో నష్టం

ఖిల్లాఘణపురం/కొత్తకోట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో అకాల వర్షానికి 453 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఖిల్లాఘణపుం మండలంలో 83 మంది రైతులకు సంబంధించి 123 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి తీవ్ర నష్టం వాటిళ్లిందని మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లయ్య తెలిపారు. మండలంలోని సల్కెలాపూర్‌, అప్పారెడ్డిపల్లి, అల్లమాయపల్లి, మల్కిమియాన్‌పల్లి, పర్వతాపూర్‌, ఖిల్లాఘణపురంలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అల్లమాయపల్లి శివారులోని 73 ఎకరాల్లో వరి, 22 ఎకరాల్లో మొక్కజొన్న, 28 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొత్తకోట మండలంలో కానాయపల్లి, సంకిరెడ్డి, రాయనిపేట, అమడబాకుల గ్రామాల్లో వ్యవసాయ అధికారుల బృందం పర్యటించారు. కానాయపల్లి, సంకిరెడ్డిపల్లి, రాయనిపేట గ్రామాల్లో 330 ఎకరాల్లో వరి పంట అమడబాకుల, సంకిరెడ్డిపల్లి గ్రామాల్లో 18 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న పంటల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్‌, ఖిల్లాఘణపురం వ్యవసాయ శాఖ అధికారి మల్లయ్య తెలిపారు.

Updated Date - Mar 24 , 2025 | 11:37 PM