Share News

Phone Tapping: ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే..

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:43 AM

గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్‌రావుతో టచ్‌లోకి వెళ్లానని, కొన్ని నంబర్లు ఇచ్చి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించానని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, మీడియా ఛానల్‌ అధినేత శ్రవణ్‌రావు అంగీకరించినట్లు తెలిసింది.

Phone Tapping: ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే..

  • డీఎస్పీ ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నా.. కొన్ని నంబర్లు ఇచ్చి ట్యాపింగ్‌ చేయించా

  • పోలీసుల విచారణలో ఒప్పుకొన్న శ్రవణ్‌రావు.. ట్యాపింగ్‌ పరికరాలకు డబ్బులు ఎవరిచ్చారు?

  • రాధాకిషన్‌, ప్రభాకర్‌రావు ఎలా తెలుసు?.. ప్రణీత్‌రావు మీ ఆఫీసుకు ఎందుకొచ్చేవారు?

  • ఉప ఎన్నికల వేళ డబ్బు పట్టివేత వెనుక ఉన్నదెవరు?.. ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు

  • చాలా ప్రశ్నలకు జవాబులు దాటవేసిన శ్రవణ్‌రావు.. 2న మళ్లీ విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్‌రావుతో టచ్‌లోకి వెళ్లానని, కొన్ని నంబర్లు ఇచ్చి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించానని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, మీడియా ఛానల్‌ అధినేత శ్రవణ్‌రావు అంగీకరించినట్లు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదైనప్పటి నుంచి విదేశాలకు పారిపోయిన శ్రవణ్‌రావు... సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ వెనుక గేటు నుంచి వెళ్లిన శ్రవణ్‌రావును ఏసీపీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆరు గంటల పాటు విచారించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీతోపాటు సమాంతరంగా శ్రవణ్‌రావుకు చెందిన మీడియా కార్యాలయంలో ట్యాపింగ్‌ కోసం సర్వర్లను ఏర్పాటు చేశారని, ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నుంచి పరికరాలను శ్రవణ్‌రావు కొనుగోలు చేసి పోలీసులకు ఇచ్చారని.. అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాకింగ్‌ పరికరాల కొనుగోలుకు డబ్బు ఎవరిచ్చారు? అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును ఎవరు పరిచయం చేశారు? అప్పటి ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు మీ కార్యాలయానికి తరచు ఎందుకు వచ్చే వారు?


మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కొంతమంది కాంగ్రెస్‌ నేతలు, రియల్టర్లు, సెలబ్రిటీల ఫోన్‌ నంబర్లను మీరు ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌కు ఇచ్చారా? ఆ నంబర్లను మీ మీడియా ద్వారానే సేకరించారా.. లేక ఎవరైనా ఇచ్చారా? ప్రభుత్వంతో ప్రత్యక్షంగా మీకెలాంటి సంబంధం లేకపోయినా ఇంత సున్నిత వ్యవహారంలో ఎందుకు వేలు పెట్టారు?.. ఇలా అనేక ప్రశ్నలను పోలీసులు శ్రవణ్‌రావు ముందు ఉంచినట్లు తెలిసింది. అయితే, పోలీసులు సంధించిన ప్రశ్నలకు శ్రవణ్‌రావు సూటిగా సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఆరు గంటల పాటు సాగిన విచారణలో పోలీసులకు పెద్దగా సహకరించలేదని తెలిసింది. ముఖ్యంగా రాజకీయ నేతలతో సంబంధాల గురించి ఏమాత్రం పెదవి విప్పలేదని తెలిసింది. ప్రణీత్‌రావుతో సంబంధాల విషయమై కొన్ని అంశాలు బయటపెట్టినా.. రాజకీయ నేతల గురించి ఏమాత్రం మాట్లాడలేదని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు అనే మాట మినహా ఎలాంటి వివరాలు బయటపెట్టలేదని వినికిడి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రవణ్‌రావు వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 2వ తేదీన మళ్లీ విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు. శ్రవణ్‌రావు పూర్తి స్థాయిలో పెదవి విప్పితే.. బీఆర్‌ఎస్‌ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మంత్రులకు చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:43 AM