Malreddy: మంత్రి పదవికి కులమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:35 AM
ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

మంత్రి పదవి వచ్చే సామాజిక వర్గ నేతనే గెలిపించుకుంటాం: మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణల్లో భాగంగా తనకు రాకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారిని గెలిపిస్తామని చెప్పారు. అప్పుడైనా రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జానారెడ్డి పెద్ద దిక్కులాంటివారని, ఆయనతో చర్చించి అధిష్ఠానాన్ని కలిసేందుకు వచ్చామన్నారు.
రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను అధిష్ఠానానికి తెలియజేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్, ఉత్తమ్‌కు చెప్పిన తర్వాతే ఢిల్లీకి వచ్చామన్నారు. కొన్ని జిల్లాలకు ఇద్దరు ముగ్గురు మంత్రులుండి కొన్ని జిల్లాలకు లేకపోవడం ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లవన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన నాయకుడిగా తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలన్నారు. ఏదైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడే తాను నడుచుకుంటానన్నారు.