Share News

కొనుగోలే బంగారమాయే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:24 AM

బంగారం ధర భగ్గుమంటోంది. సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకుతోంది.

కొనుగోలే బంగారమాయే..

బంగారం ధర భగ్గుమంటోంది. సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకుతోంది. నాలుగేళ్లలో రెండింతలకు దగ్గరైంది. శుక్రవారం నాటికి బంగారం 10 గ్రాములు రూ.91వేల పైచిలుకు ఉంది. ఇదే తరహాలో వెండి ధరలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వెండి 10 గ్రాములు రూ.1000గా ఉంది. ఇక రేపోమాపో బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయగలమా అనే స్థాయికి చేరుతోంది. ప్రస్తుతం కొనుగోళ్లు నేలచూపులు చూస్తున్నాయి.

- (ఆంధ్ర జ్యోతి-రామగిరి)

తెలుగు ప్రజలకు బంగారమంటే ఎనలేని మోజు. కొంతమంది బంగారు ఆభరణాలను అందం, హోదా కోసం ధరిస్తుంటే మరికొందరు ఆర్థిక రక్షణగా ఉంటుందని కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. ఇలాంటి కారణాల వల్లే బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఆడపిల్లల వివాహాలు చేస్తే మొట్టమొదటిగా బంగారానికే ప్రాధాన్యమిస్తుంటారు. గతంలో ఉన్నతవర్గాలు 20 నుంచి 50 తులాల వరకు కొనుగోలు చేస్తుండగా, మధ్యతరగతి వర్గాలు కనీసం 5 తులల వరకు కొనుగోలు చేసేవారు. ఇక పేద కుటుంబాల వారు వారి కుమార్తెల వివాహాలు జరిపితే కనీసం తులం బంగారమైన కొనుగోలు చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహ సమయాల్లో 500 గ్రాములు కొనుగోలు చేసే ఉన్నతవర్గాల వారు ఇప్పుడు 100గ్రాములు కొనుగోలుతో సర్దుకునే పరిస్థితి. వీరికి పెద్దగా ఇబ్బంది కాకున్నప్పటికీ మధ్య, పేద తరగతుల వారు ఇబ్బందులు ఎదుర్కొకతప్పదు. కనీసం తులం బంగారం కొనాలన్నా రూ.లక్ష వరకు వెచ్చించాల్సిన వస్తుండటంతో కొనుగోలు అందని ద్రాక్షగా మారుతోంది.

తగ్గిన విక్రయాలు

నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, నార్కట్‌పల్లి, మునుగోడు, కొండమల్లేపల్లి, సంస్థాననారాయణపురం వంటి పట్టణాల్లో జ్యూయలరీ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ 15 నుంచి 20 కిలోల వరకు బంగారం విక్రయాలు సాగుతుంటాయి. వివాహ శుభముహుర్తాల్లో అయితే విక్రయాలు రెట్టింపుస్థాయిలోనే జరుగుతుంటాయి. అయితే వివాహ శుభముహుర్తాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ధర రూ.91వేల పైచిలుకు చేరడంతో మూడు నుంచి నాలుగు కిలోలు మాత్రమే విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆ మేరకు వ్యాపారం 60శాతానికి పైగా పడిపోయినట్లు స్పష్టమవుతోంది.

పాతికేళ్లలో 20రెట్లు

బంగారం ధర పాతికేళ్లలో 20 రెట్లు పెరిగింది. 2000 సంవత్సరంలో తులం(10 గ్రాములకు) రూ.4,000 ఉండ గా ఐదేళ్ల అనంతరం 2005కు రూ.6,500కు చేరింది. ఆ తర్వాత 2010 నాటికి రూ.21,200లకు చేరింది. ఈ మధ్యలోనే మూడేరెట్లు ధర పెరిగింది. 2015 నాటికి రూ.27,200 ఉండగా 2020 నాటికి రూ.40,600 చేరుకుం ది. మరో ఐదేళ్లు ప్రస్తుం శుక్రవారం నాటికి రూ.91,000 పలుకుతోంది. ఈ ఐదేళ్లలో రెండింతలైంది.

హెచ్చుకు కారణాలివే..

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, క్రూడ్‌ఆయిల్‌ వంటి వాటికి మంచివిలువ, మార్కెట్‌ ఉంటుంది. ఎక్కువశాతం క్రూడ్‌ఆయిల్‌పై పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం బంగారంపై మక్కువచూపడంతో ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నాయి. దీంతో పాటు విదేశాల నుంచి బంగారు ఎక్కువగా దిగుమతి అవుతోంది. పన్నుల శాతం పెరగడం కూడా మరో కారణంగా జ్యూయలరీ వ్యాపారులు చెపుతున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:24 AM