Share News

ఆయాసంతో డయల్‌ 108కు ఫోన

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:14 AM

ఆస్తమా వ్యాధి కారణంగా ఒక్కసారిగా ఆయాసం పెరిగి ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఆయాసంతో డయల్‌ 108కు ఫోన

అనంతరం ఫోన ఎత్తకపోవడంతో వెనుదిరిగిన సిబ్బంది

తెల్లవారేసరికి మృతి

నిడమనూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఆస్తమా వ్యాధి కారణంగా ఒక్కసారిగా ఆయాసం పెరిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ చుట్టుపక్కల లేకపోవడంతో మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నందికొండవారిగూడెం శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని సీతారాంపురానికి చెందిన షేక్‌ సలాం(50) గతంలో మిర్యాలగూడ మునిసిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగం చేసి కొంతకాలం క్రితం మానేశాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఏజెంట్‌గా ఉంటూ వ్యవసాయభూములు, తోటలు, ప్లాట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా హెర్నియా, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నిడమనూరు మండలం నందికొండవారిగూడెం శివారులో కంభంపాటి వెంకట్‌రెడ్డి అనే రైతుకు చెందిన బత్తాయితోట విక్రయానికి ఉందని తెలిసి ఆదివారం తోట వద్దకు వచ్చి అక్కడ తిరుగుతూ తోట గురించి చుట్టుపక్క రైతులను విచారించాడు. తనకున్న ఆస్తమా వ్యాధి కారణంగా సాయంత్రం ఒక్కసారిగా ఆయాసం పెరిగింది.

108 అంబులెన్సకు ఫోన

ఆయాసం పెరగడంతో సలాం సాయం కోసం 108 అంబులెన్సకు ఫోన చేసి వివరాలు చెప్పాడు. తనకు ఆయాసం వస్తోందని, హెర్నియాతోనూ ఇబ్బంది పడుతున్నట్లు సిబ్బందికి చెప్పి వెంటనే రావాలని కోరాడు. వారు వాహనంతో నందికొండవారిగూడెం గ్రామానికి చేరుకుని సలాం ఫోనకు తిరిగి ఫోన చేశారు. చీకటి అవడం, ఎంతసేపటికి ఫోన ఎత్తకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న రైతులు సలాం మృతి చెంది ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియాఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు షేక్‌ సోఫియాన్‌ సోమవారం ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 25 , 2025 | 12:14 AM