Share News

కొండమల్లేపల్లిలో భారీ చోరీ

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:12 AM

నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.27 లక్షల విలువైన 30 తులాల బంగారం, రూ.5 లక్షల సొత్తు చోరీకి గురైంది.

కొండమల్లేపల్లిలో భారీ చోరీ
చోరీ జరిగిన ఇంటిలో చిందర వందరగా పడి ఉన్న సామాగ్రి

రూ.27 లక్షల విలువైన బంగారం, రూ.5 లక్షల నగదు అపహరణ

కొండమల్లేపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.27 లక్షల విలువైన 30 తులాల బంగారం, రూ.5 లక్షల సొత్తు చోరీకి గురైంది. ఇదిలా ఉండగా చోరీ విషయం తెలుసుకుని వెళ్లి తనిఖీ చేసిన పోలీసులకు పోయిన సొత్తుకన్నా ఎక్కువ బంగారం లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండమల్లేపల్లి మండలకేంద్రంలోని వాసవీబజారులో నివాసముంటున్న గుర్రం లక్ష్మీకాంతమ్మ రెండేళ్ల క్రితం తన భర్త వాసుదేవ్‌ చనిపోవడంతో పట్టణంలోని వినాయక్‌నగర్‌లో తన ఇద్దరు కుమారులు చంద్రశేఖర్‌, మహే్‌షతో కలిసి ఉంటుంది. అయితే వాసవీబజార్‌లోని తన ఇంటికి మాత్రం అడపాదడపా వచ్చి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం వాసవీబజార్‌లో ఉన్న ఇంటికి గుర్రం లక్ష్మీకాంతమ్మ, చిన్నకుమారుడు మహేష్‌ కలిసి వెళ్లగా ఇంటి తలుపులు విరగొట్టి ఉండడం, ఇంట్లోని సామాగ్రి చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించి చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని డయల్‌ 100కు కాల్‌ చేసి వివరాలు తెలిపారు. 30 తులాల బంగారం, రూ.5లక్షల నగదు చోరీకి గురైనట్లు సమాచారం అందించాడు. దీంతో కొండమల్లేపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అనంతరం దేవరకొండ ఏఎస్పీ మౌనిక కూడా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. గుర్రం లక్ష్మీకాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇంట్లో 34.5 తులాల బంగారం స్వాధీనం

దొంగతనం జరిగిన ఇంటిని తనిఖీ చేస్తున్న పోలీసులకు విస్తుపోయేలా బంగారం బయటపడింది. 34.5 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.8.7లక్షల నగదు లభ్యమయ్యాయి. బాధితుడు డయల్‌-100 కాల్‌ చేసి చోరీ జరిగినట్లు పేర్కొన్న సొత్తు కంటే అదనంగా బంగారం, వెండి, నగదు లభ్యం కావడంతో పోలీసులు లభ్యమైన బంగారం, వెండి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇంకా 10 తులాల బంగారం, రూ.5లక్షల నగదు అపహరణకు గురైనట్లు చెబుతుండటంతో చోరీ ఎంత జరిగిందనే విషయమై స్పష్టత రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 25 , 2025 | 12:12 AM