ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:53 AM
ఉపముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థికబడ్జెట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కిం ది. బడ్జెట్ ప్రసంగంలో జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మూసీకాల్వలు, యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్, యాదగిరిగుట్ట ఆలయాల గురించి ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ప్రస్థావించారు.

మే నెలాఖరుకు వైటీపీఎస్ ఐదు యూనిట్లలో విద్యుదుత్పాదన
ప్రజల మనోభావాల మేరకు యాదగిరిగుట్టగా పేరుమార్పు
ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రూ.2161.29 కోట్ల నిధుల కేటాయింపులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): ఉపముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థికబడ్జెట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కిం ది. బడ్జెట్ ప్రసంగంలో జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మూసీకాల్వలు, యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్, యాదగిరిగుట్ట ఆలయాల గురించి ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ప్రస్థావించారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం తీసుకురాబోతున్న యంగ్‌ఇండియా స్కూళ్లు, ఏటీసీ కేంద్రాలు, నర్సింగ్, హెల్త్ సైన్స్ కా లేజీల్లోనూ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం కన్పించింది. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.21 61.29 కోట్ల నిధులను ఈబడ్జెట్‌లో కేటాయించారు.
నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటిని అందించడానికి వీలుగా లక్ష ఎకరాల ఆయకట్టు, 107 గ్రామాలకు తాగునీరందించే లక్ష్యంతో బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం చేపట్టి వేగవంతంగా పనులు చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగం లో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదేవిధంగా మూసీ పరిధిలోని బునాదిగానికాల్వ పునరుద్దరణ పనులకు రూ.266.65కోట్ల నిధులతో పాలనా అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. బునాదిగాని కాల్వతోపాటు పిలాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి కాలువలకు ఈనిధులు వెచ్చిస్తామని పేర్కొన్నారు.
థర్మల్ పవర్‌ప్లాంట్‌లో అన్ని యూనిట్లలో విద్యుదుత్పాదన
దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తోన్న నాలుగువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పర్యావరణ అనుమతులను తమ ప్రభుత్వం సాధించి ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలను తొలగించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు యూనిట్లు సింక్రనైజ్ చేయగా, వచ్చే మే నెల నాటికి మొత్తం అయిదు యూనిట్లలో విద్యుదుత్పాదన చేపడతామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
పెండింగ్ ఇళ్ల పూర్తికి నిధులు
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాని కి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇందుకోసం ప్రతీ ఇంటి కి రూ.4లక్షల నిధులు మం జూరు చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో దీని ప్రకారం 42వేల పేద కుటుంబాల కు ఇందిరమ్మ ఇళ్లు ఈ సంవత్సరం రాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి వదిలేసిన, పాక్షిక నిర్మాణాలున్న అన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తిచేసి అర్హులైన పేదలకు అందిస్తామని పేర్కొనడమేకాకుండా అందుకు అవసరమయిన నిధులను కూడా ఈ బడ్జెట్‌లో కేటాయించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డబ ల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మోక్షం లభించబోతుంది.
ప్రతీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నల్లగొండ, ము నుగోడు నియోజకవర్గాలకు ఈ స్కూళ్లు రాగా, తాజాగా మిగిలిన 10 నియోజకవర్గాలకు ఈ స్కూళ్లు రాబోతున్నా యి. 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో స్కూల్‌కు దాదాపు రూ.20కోట్ల వరకు నిధులు మంజూరవుతాయి. అదేవిధం గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా ఆ కేంద్రంలో ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలపై శిక్షణ, స్టడీ మెటీరియల్ అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు రూ.2161.29 కోట్లు
ఉమ్మడి జిల్లా నల్లగొండ జిల్లాకు సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో ఆశించినమేర నిధులు కేటాయించారు. ప్రధానంగా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు అధికంగా నిధులు కేటాయించగా, అతి స్వల్పంగా డిండి ప్రాజెక్టుకు నిధులు దక్కాయి. ఏఎమ్మార్పీ, బ్రాహ్మణవెల్లంల లిఫ్టు, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్ వంటి పనులన్నీంటికీ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నిధులనుంచే ఇవ్వనుండడంతో ఈ ప్రాజెక్టు కింద కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయి.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి పనులకు రూ.35 కోట్లు
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ఈ బడ్జెట్‌లో రాష్ట్ర పథకాల ద్వారా వివిధ అభివృద్ధి పనులకు రూ.35కోట్ల నిధులను కేటాయించింది. ఈసారి యూనివర్సిటీ పనుల నిమిత్తం రూ.309కోట్లతో ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే నేరుగా రాష్ట్ర పథకాల కింద రూ.35కోట్లు ప్రభుత్వం కేటాయించగా, కేంద్ర ప్రాయోజికత రూసా పథకానికి, ఇతర యూజీసీ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించడంతో ఈసారి ఈ పథకాల కింద కూడా ఎంజీయూకు తగిన నిధులు వస్తాయని తద్వారా ఉన్నత విద్యామండలికి ప్రతిపాదించిన పనులకు మోక్షం లభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూసాపై జరిగే సమీక్ష తర్వాత ఈ నిధుల కేటాయింపులపై స్పష్టత రానుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు 2024-25 అంచనా 2024-25 సవరణ 2025-26 ప్రతిపాదనలు
1. ఎస్‌ఎల్‌బీసీ 799.90 799.90 899.90
2. డిండి లిఫ్ట్ 300.00 300.00 400.00
3.మూసీకాల్వలు 4.00 4.00 266.65
4.ఎస్‌ఆర్‌ఎస్పీరెండోదశ 34.01 34.01 34.01
5.శ్రీశైలందిగువ 3.89 3.89 2.01
6.నాగార్జునసాగర్ 96.07 96.07 297.95
7.డిండి ప్రాజెక్టు 2.00 2.00 2.00
8. మూసీ ప్రాజెక్టు 64.00 64.00 50.00
9. ఎత్తిపోతలపథకాలు 158.30 158.30 208.77
మొత్తం 1462.17 1462.17 2161.29