చివరి దశలో పంటకు ఊపిరి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:12 AM
వరదకాల్వకు నీటి రాకతో జీవం కోల్పోతున్న పంటలకు ఊపిరిపోసినట్లయ్యింది. నాలుగు రోజులుగా నీరు వస్తుండటంతో చివరిదశలో ఉన్న పంటలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.

వరద కాల్వకు నీటి విడుదల
మాడ్గులపల్లి నుంచి 72 కిలోమీటర్ వరకు
యుద్ధ ప్రాతిపదికన అధికారుల చర్యలు
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
వరదకాల్వకు నీటి రాకతో జీవం కోల్పోతున్న పంటలకు ఊపిరిపోసినట్లయ్యింది. నాలుగు రోజులుగా నీరు వస్తుండటంతో చివరిదశలో ఉన్న పంటలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ఈ నెల 24న ‘కదిలిస్తే కన్నీటి వరద’ అనే శీర్షికన రైతుల కష్టాలను ప్రచురించింది. వరద కాల్వకు నీటి సరఫరా చేయడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ(వ్యవసాయం)
మొదట్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వరదనీటితో నిండుకుండులా మారడటంతో ఎడమకాల్వతో పాటు వరదకాల్వకు సాగు నీటివిడుదల చేశారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు సజావుగా నీరు వస్తుండటంతో ఐదు మండలాల్లో ఈ కాల్వ కింద సుమారు 45వేల ఎకరాల్లో వరిని సాగుచేశారు. ఇటీవల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వరదకాల్వకు నీరందలేదు. దాంతో ఈ నెల 15 నుంచి వరద కాల్వకు సాగు నీటి విడుదల నిలిచింది. కాల్వ కింద సాగు చేసిన పంటలు చేతి కొచ్చేది కష్టంగా మారింది. అప్రమత్తమయిన అధికారులు రిజర్వాయర్ నుంచి మోటార్లు వరకు ఉన్న(కిలోమీటర్ పొడవు) అప్రోచ కాల్వను ఎక్స్‌వేటర్ ను సుమారు 50గంటలు వినియోగించి లోతు తీశారు. దీనికి తోడు శ్రీశైలం నుంచి 20-30వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. దాంతో జలాశయంలో 521 అడుగుల వద్ద నీరు నిలకడగా ఉంది. ఈ నెల 24న ఒక మోటారు ద్వారా 300క్యూసెక్కుల నీటిని వరదకాల్వకు విడుదల చేశారు. 27వ తేదీ వరకు కాల్వకు చివరి మండలం అయిన మాడ్గులపల్లి మండలంలోని 72 కిలోమీటర్ల వద్దకు నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో మరో మోటార్ వినియోగంలో తీసుకువచ్చి రెండు మోటార్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని పంటలు పూర్తయ్యే వరకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
కంటి మీద కునుకు లేదు
వరదకాల్వకు నీరు నిలిచిపోయిన దగ్గర నుంచి పంటలు ఎండిపోతుండటంతో కంటి మీద కునుకు లేకుండాపోయింది. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి యుద్ధ ప్రాతిపదికన అప్రోచ కాల్వ పనులు వేగవంతంగా చేపట్టారు. ఎట్టకేలకు వరద కాల్వకు నీటి విడుదల చేశారు. మూడు రోజులుగా వరసగా నీరు వస్తుండటంతో పొలాలకు నీరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇపుడు కోలుకుంటున్నాయి.
మందడి సుధాకర్‌రెడ్డి, రైతు,రామడుగు