మెట్రో రైల్‌పై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆపండి
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:04 AM
మెట్రో రైళ్లు, స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులపై అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ప్రదర్శన, ప్రచారం నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణకు ఆదేశించండి
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
హైదరాబాద్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): మెట్రో రైళ్లు, స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులపై అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ప్రదర్శన, ప్రచారం నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్థానిక కేపీహెచ్‌బీకి చెందిన న్యా యవాది నాగుర్‌బాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఆదేశించాలని పిటిషనర్ కోరారు. బెట్టింగ్ వేదికలు, యాప్‌ల ప్రచారానికి హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై స్థాయీ నివేదిక సమర్పించేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రకటన విధానాలపై సమీక్షకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసినందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్, బాఽధ్యులైన అధికారులపై భారీ మొత్తంలో జరిమానా విధించి, బెటింగ్ యాప్‌ల బాధితుల సహాయ నిధికి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులు, మౌలికసదుపాయాలపై అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం జరగకుండా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ త్వరలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు రానున్నది.