Rythu Bharosa: 2 ఎకరాల రైతుకు చేరిన భరోసా!
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:12 AM
రాష్ట్రవ్యాప్తంగా 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తయింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 34.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,218.49 కోట్ల మేర నిధులు జమ అయ్యాయి.

34.69 లక్షల మంది ఖాతాల్లో రూ.2218.49 కోట్ల జమ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తయింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 34.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,218.49 కోట్ల మేర నిధులు జమ అయ్యాయి. రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన ప్రభుత్వం.. సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లు కలిపి ఎకరాకు రూ.12 వేలు రైతులకు సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.6 వేల చొప్పున జనవరి 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఆ రోజు ఎంపిక చేసిన 577 గ్రామాల్లోని 4.41 లక్షల మంది రైతులకు రూ.569 కోట్ల మేరకు జమ చేసింది.
ఈ నెల 5 కల్లా ఎకరం వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయడం పూర్తయింది. ఈ నెల 6 నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల దాకా రైతు భరోసా నిధులు విడుదల చేయడం ప్రారంభించిన ప్రభుత్వం.. సోమవారం నాటికి దీనిని పూర్తి చేసింది. కాగా, ఇప్పటివరకు విడుదలైన నిధుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూ.173.80 కోట్లు, సిద్దిపేట జిల్లాకు రూ.116.26 కోట్లు, సంగారెడ్డికి రూ.106.77 కోట్లు, సూర్యాపేటకు రూ.106.19 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.105.28 కోట్ల చొప్పున విడుదలయ్యాయి. ఇదిలా ఉండగా.. రెండెకరాల వరకు నిధుల విడుదల పూర్తయిన రూ.2218.49 కోట్ల నిధులతోనే రాష్ట్రంలోని దాదాపు 45 శాతం మంది రైతులకు రైతు భరోసా సాయం అందిందిం. రెవెన్యూ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 77 లక్షల మంది రైతులు రైతు భరోసా లబ్ధిదారులుగా ఉన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News