Supreme Court: కంచ గచ్చిబౌలి నివేదికపై కసరత్తు
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:29 AM
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ నివేదిక తయారీకి ఉపక్రమించింది.

ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ సమావేశం
సాయంత్రం భట్టి, మంత్రి పొంగులేటి భేటీ
ఇది త్రిసభ్య కమిటీ తొలి సమావేశం
సుప్రీంకు సమర్పించాల్సిన నివేదికపై చర్చ
అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని యోచన
హైదరాబాద్, ఏప్రిల్4 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ నివేదిక తయారీకి ఉపక్రమించింది. ఇందులో భాగంగా సచివాలయంలో శుక్రవారం రెండు కీలక సమావేశాలు జరిగాయి. ఉదయం 11 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ, అటవీ శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గురువారం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీలో భట్టి, పొంగులేటితోపాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. భట్టి, పొంగులేటి భేటీ కావడంతో త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరిగినట్టు అయింది. కాగా, కంచ గచ్చబౌలి భూములకు సంబంధించి సుప్రీం కోర్టు, హైకోర్టు లేవెనెత్తిన వివిధ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.
ఈ నెల 16వ తేదీ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా బాధ్యులవుతారని సుప్రీం కోర్టు సీఎ్‌సను ఆదేశించింది. దీంతో శుక్రవారం నాటి సమావేశాల్లో సుప్రీంకు అందజేయాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. ఇప్పుడే పూర్తి స్థాయి అవగాహనకు రాకపోయినా.. తదుపరి జరిగే త్రిసభ్య కమిటీ సమావేశాల్లో ఆయా అంశాలపై మరింత చర్చించాలని నిర్ణయించారు. ఇక, భూమికి సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని భట్టి అధికారులను ఆదేశించారు. ఇక, త్రిసభ్య కమిటీ త్వరలోనే విద్యార్థి సంఘాలు, పర్యావేరణవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారులతో సమావేశం కానుంది. శనివారమే సమావేశమయ్యే అవకాశాలు లేకపోలేదు. త్రిసభ్య కమిటీలోని భట్టి విక్రమార్క శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భద్రాచలం వెళ్లనున్నారని సమాచారం. దీంతో శ్రీరామ నవమి తర్వాత సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే, ఈ నెల 16లోపు సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించాల్సి ఉండడంతో సానుకూల అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని భట్టి విక్రమార్క సీఎ్‌సకు సూచించినట్లు తెలిసింది. భూమి ప్రభుత్వానిదేనని, దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని న్యాయస్థానానికి నివేదించాలని యోచించారు. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్, ఇతర సీనియర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించారు. భూసంబంధ వ్యవహారాల్లో నిపుణులైనవారిని కూడా సమావేశాలకు పిలవనున్నట్లు తెలిసింది. ఏమైనా.. నివేదిక తయారీకి ప్రభుత్వం మాత్రం తీవ్ర కసరత్తు చేస్తోంది.
కంచ గచ్చిబౌలిలోకి నో ఎంట్రీ
400 ఎకరాల ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం
144 సెక్షన్ అమలు.. 16వ తేదీ వరకు పోలీసు ఆంక్షలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రాంతంలో బయటి వ్యక్తుల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అంతేకాక, ఆ ప్రాంతంలో ఈ నెల 16వ తేదీ వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎ్‌సఎస్ (గతంలో ఐపీసీ 144వ సెక్షన్) అమలు చేస్తున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు మాదాపూర్ జోన్ డీసీపీ డా. జి.వినీత్ శుక్రవారం ప్రకటించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించిన సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో కేంద్ర సాధికార కమిటీ ఆదేశాలను, శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజల రోజువారీ జీవనానికి, భద్రతకు ప్రమాదం జరగకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 16వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తమకు సహకరించాలని మాదాపూర్ డీసీపీ కోరారు.