Share News

Tirumala Darshan: టీటీడీ సిఫారసు లేఖలకు ప్రత్యేక వెబ్‌సైట్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:29 AM

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Tirumala Darshan: టీటీడీ సిఫారసు లేఖలకు ప్రత్యేక వెబ్‌సైట్‌

  • ఆ పోర్టల్‌ ద్వారా జారీ చేసినవే చెల్లుబాటు

  • లేఖల జారీకి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక లాగిన్‌ ఐడీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌ ద్వారా జారీ చేసిన సిఫారసు లేఖలు మాత్రమే ఇకపై తిరుమలలో చెల్లుబాటు అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుక్రవారం పంపారు. సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తుకు ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తోనే ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేలా ఏర్పాటు చేశారు.


తిరుమల దర్శనానికి ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలన్నింటినీ ఈ పోర్టల్‌ ద్వారానే ఇవ్వాలని సూచించారు. పోర్టల్‌లో నమోదు కాని లేఖలను టీటీడీ అంగీకరించదని స్పష్టం చేశారు. కాగా, ప్రజాప్రతినిధి తమ ఐడీతో పోర్టల్‌లో లాగిన్‌ అయ్యాక తాము ఎవరికి లేఖ ఇస్తున్నామో ఆ భక్తులు వివరాలు, వారికి ఏ రకమైన దర్శనం కావాలనే వివరాలు నమోదు చేయాలి. ఆపై సిఫారసు లేఖను డౌన్‌లోడ్‌ చేసి దానిపై సంతకం చేసి తిరిగి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చెయ్యాలి. ఇలా అప్‌లోడ్‌ చేసిన లేఖలు టీటీడీ లైజనింగ్‌ అధికారికి, లేఖ పొందిన భక్తులకు వాట్సా్‌పలో చేరుతాయి.

Updated Date - Apr 05 , 2025 | 04:29 AM