Tummala Nageswara Rao: ‘సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:13 AM
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రైతులు భూములు ఇస్తేనే ప్రాజెక్టులు సత్వరం పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. అందరి సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

రైతులు భూములిస్తేనే ప్రాజెక్టులు పూర్తవుతాయి
అందరి సహకారంతోనే అభివృద్ధి: మంత్రి తుమ్మల
రాజీవ్ లింక్ కెనాల్‌లోకి గోదావరి జలాల విడుదల
జూలూరుపాడు/ఏన్కూరు/ఖమ్మం, మార్చి 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీతారామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని, రెండు, మూడేళ్లలో దశలవారీగా పది లక్షల ఎకరాలకు నీరందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రైతులు భూములు ఇస్తేనే ప్రాజెక్టులు సత్వరం పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. అందరి సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి రేవంత్‌రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసే అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు తనకు కల్పించారన్నారు. ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాల్వ ద్వారా వచ్చిన గోదావరి జలాలను బుధవారం రాత్రి రాజీవ్ లింక్ కెనాల్‌కు మంత్రి తుమ్మల అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఏన్కూరు లింక్‌కెనాల్ ద్వారా గోదావరి జలాలను సాగర్ కాలవకు అనుసంధానం చేయవచ్చని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పిన వెంటనే.. ఆయన స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన అవకాశంతో 43ఏళ్లుగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తనపై ఉన్న నమ్మకంతోనే రాజీవ్‌కెనాల్‌కు రైతులు భూములు ఇచ్చారని, తద్వారానే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తీసుకురాగలిగామని తెలిపారు. త్వరలో కొత్తగూడేనికి ఎయిర్‌పోర్టు మంజూరు కాబోతుందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు తక్కువ కేటాయింపులు జరిగాయని, రెండు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందన్నారు.
కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు
సాగర్ ఆయకట్టును స్థిరీకరించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల ఎట్టకేలకు నెరవేరింది. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానానికి ఏన్కూరు లింక్‌కెనాల్ వేదికగా నిలిచింది. ఈనెల 3న ఉదయం 10గంటలకు భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరునుంచి సీతారామ ప్రాజెక్టు మొదటి లిఫ్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభించారు. ఆ నీళ్లు 40కి.మీ ప్రయాణించి ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉన్న రెండో లిప్టు వద్దకు చేరుకున్నాయి. అక్కడ సీతారామ రెండో లిప్టు ద్వారా ఎత్తిపోసి కమలాపురం లిప్టుకు చేర్చారు. అక్కడ నుంచి 57కి.మీ ప్రయాణించి సీతారామ ప్రాజక్టు కెనాల్ 100వ కిలోమీటర్ పాయింట్‌కు చేరుకున్నాయి. అక్కడ రాజీవ్ కెనాల్‌కు అనుసంధానించారు. ఆ కాల్వలో 8.6కి.మీ ప్రయాణించిన గోదావరి జలాలు.. ఎట్టకేలకు సాగర్ ఎడమకాల్వకు చేరుకున్నాయి.