Share News

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:37 AM

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

  • ఆ పార్టీ నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు

  • నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌/మఠంపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై బురదజల్లుతూ సోషల్‌ మీడియా ద్వారా బీఆర్‌ఎస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి క్షేత్రంలోని ఆర్యవైశ్య సత్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తుపైనా బీఆర్‌ఎస్‌ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసేందుకే కొందరు నాయకులు పర్యటనలు చేస్తున్నారని కేటీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు.


రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందని వివరించారు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డిని మట్టపల్లి క్షేత్రానికి ఆహ్వానించామని చెప్పారు. సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉందన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల నాణ్యమైన బియ్యం అందిస్తామని చెప్పారు. అంతకముందు మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో మంత్రి ఉత్తమ్‌ పాల్గొన్నారు. అనంతరం సీఎం సభకు స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - Mar 21 , 2025 | 04:37 AM