సైబర్ నేరగాళ్ల సేవలో తెలంగాణ గ్రామం!
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:25 AM
కోదాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో బీటెక్ అగ్రికల్చర్ చదువుతున్నాడు. ఊరి నుంచి యువకుడి తండ్రి ఫోన్ చేసి, అర్జెంట్‌గా ఇంటికి రావాలని, ఊర్లో కుర్రాళ్లంతా ట్రేడింగ్ చేస్తూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్నట్లు చెప్పాడు.
ట్రేడింగ్ పేరిట తెలియకుండానే సైబర్ మోసాల్లోకి..
ఆ ఊరి యువతదంతా అదే దారి.. ఇద్దరి అరెస్టుతో వెలుగులోకి
హైదరాబాద్ సిటీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కోదాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో బీటెక్ అగ్రికల్చర్ చదువుతున్నాడు. ఊరి నుంచి యువకుడి తండ్రి ఫోన్ చేసి, అర్జెంట్‌గా ఇంటికి రావాలని, ఊర్లో కుర్రాళ్లంతా ట్రేడింగ్ చేస్తూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్నట్లు చెప్పాడు. తండ్రి మాట కాదనలేక అతడు ఊరెళ్లాడు. అప్పటికే ఆ తండ్రి ట్రేడింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఊరెళ్లిన కొడుకు ఇతర యువకులతో పాటు.. కొన్ని ట్రేడింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ట్రేడింగ్‌లో పాల్గొనడం, నిర్వాహకులకు బ్యాంకు ఖాతాలు అందించడం, ఇతరులతో పెట్టుబడులు పెట్టించి ఆ డబ్బును యూఎ్‌సడీలుగా కన్వర్ట్ చేసి పంపడం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు.. కొంతకాలం క్రితం భర్త మృతి చెందడంతో ఆడపిల్లల బాధ్యత తనపై పడింది. దాంతో ఆమె కష్టపడి పెద్ద కూతురు పెళ్లి చేసింది. రెండో కూతురు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది.
ఊర్లో ఉన్న యువతీయువకులంతా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసిన తల్లి.. తన కూతురును పట్టుబట్టి గ్రామానికి రప్పించింది. తల్లి మాట కాదనలేక ఆ యువతి ట్రేడింగ్ చేస్తూ పెట్టుబడులు పెట్టించడం, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం చేస్తోంది. డబ్బుల వస్తాయన్న ఆశతో.. తల్లిదండ్రుల ఒత్తిడితో ట్రేడింగ్ పేరిట తెలియకుండానే ఆ ఊరి యువత సైబర్ మోసాల్లో పాలుపంచుకున్నారు. ఓ ట్రేడింగ్ మోసం కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఛేదించే క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఓ యువతి, మరో యువకుడికి సంబంధముందని తేలడంతో.. విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ ఊరిలోని వారంతా ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టించడంతో పాటు.. బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, సైబర్ మోసగాళ్లకు సహకరిస్తూ.. పెట్టుబడి పెట్టిన డబ్బును యూఎ్‌సడీలుగా మార్చడం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారినీ నిందితులుగా చేర్చారు. అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. తెలిసీ తెలియకుండా ట్రేడింగ్ పేరిట డబ్బు కోసం సైబర్ నేరాల బారిన పడొద్దని, నేరగాళ్లకు సహకరించి సైబర్ నేరాల్లో ఇరుక్కోవద్దని డీసీపీ ధార కవిత హెచ్చరించారు.