సుప్పులు - చక్కిలాలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:23 AM
శ్రీకాకుళం ప్రాంతంలో చక్కిలాల్ని సుప్పులు అంటారని బూదరాజు రాధాకృష్ణ రాశారు. బహుశా చుట్టులు అనే అర్థంలో ఈ సుప్పులు ఏర్పడి ఉండొచ్చు.

శ్రీకాకుళం ప్రాంతంలో చక్కిలాల్ని సుప్పులు అంటారని బూదరాజు రాధాకృష్ణ రాశారు. బహుశా చుట్టులు అనే అర్థంలో ఈ సుప్పులు ఏర్పడి ఉండొచ్చు.
చక్కిలాలు, జంతికలు జంటకవుల్లాంటివి.
‘‘తనకుగల్గు పెక్కు తప్పులు నుండగా/ ఓగు నేర మెంచు నొరులగాంచి /చక్కిలంబు గాంచి జంతిక నగినట్లు’’ అని వేమన పద్యం ప్రసిద్ధ్థమే! చక్కిలానికి వంపులున్నాయని జంతిక నవ్విందిట. ఒక ప్రాంతం మాండలికాన్ని ఇంకో ప్రాంతం వారు హేళన చేయటం లాంటిదే ఇది. తమ మాండలికాల్ని రచయితలు సందర్భానుసారం ప్రయోగిస్తుంటే, ఇతర ప్రాంతీయులకూ అవి తెలుస్తాయి. తద్వారా భాషా గౌరవం పెరుగుతుంది.
‘‘చక్కిల మనఁగను శష్కులి విలసిల్లు’’ - చక్కిలం అంటే, పిండి మెలిపెట్టి చేసే భక్ష్య విశేషం అని, దీన్ని సంస్కృతంలో శష్కులి అంటారని, సారెసత్తులు, జంతికలు, మణుగుబూలు ఒకటే నని అచ్చతెలుగు కోశం పేర్కొంది. ఈ శష్కులినే ‘చక్కిలాల గిద్ద’లనే యంత్రంలో పెట్టి వత్తితే అవి జంతికలు. ‘యంత్రిక’ ప్రాకృత భాషలో ‘జంతి ఆ’ తెలుగు లో జంతిక అయ్యిందన్నారు పండితులు.
శ్రీనాథుడు హరవిలాసంలో ‘‘...కుడుములు లడ్డువంబులు చక్కిలాలు మోరుండలు ఖండంబు చలిమిడీ మండపప్పు’’ అంటూ చక్కిలాల్ని ప్రస్తావించాడు. గుండ్రంగా చేత్తో మెలితిప్పి చుడతారు కాబట్టి చక్రాలు - చక్కిలాలు సక్కిలాలు సకినాలుగా ఇవి తెలుగునాట ప్రసిద్ధి పొందాయి. సకినాల తయారీకి తెలంగాణాలో ప్రత్యేకత ఉంది. బియ్యప్పిండి, నువ్వులు, వాము, ఉప్పు కలిపి ముద్దగా చేస్తారు. కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని నేర్పుగా గుండ్రంగా చుడతారు. ‘‘అరిశలు గాజాగాయలు చంద్రకాంతలూ - జంతిక చుట్టులు - జవుటులప్పాలూ - జిల్లెడగాయలూ - వల్లంకి మడుపులూ - కల కండ బూరెలూ - కజ్జముండ్రాళ్లూ’’ అంటూ 1910లో శ్రీ త్యాడ పూషవాడ్వీరవ భూవల్లభ కవి ‘వెంకటేశ్వర పద ప్రార్థన’ గ్రంథంలో స్వామికి పెట్టే నైవేద్యాలు అనేకం ప్రస్తావిం చాడు. ఇందులో జంతిక చుట్టులతో పాటు ‘వల్లంకి మడుపు’ల్ని ప్రస్తావించాడు. చేత్తో వంకీలుగా చుట్టి తయారు చేసే సకినాలే ఇవి కావచ్చు. సకినాలు చుట్టే కళలో నేర్పరులకు తెలంగాణా సమాజంలో గౌరవం ఉంది.
జంతికలు వత్తే గిద్దల్ని కారాచాచ, కారాల చిట్టి, కారాసు, పూసగొట్టం, మడుగు బూల గిద్దె, మునుగుబుల్లు చిట్లు, మురుకు అచ్చు, లంక శేగుల పీట, వాంపొళ్లు, సేవుపీట, సొండిగల అచ్చు, సొలిగ ఇలా పిలుస్తారు. ఈ పేర్లను బట్టి చక్కిలాలను కారంచుట్లు, కారప్పూస, మడుగుబూలు, మునుగుబూలు, లంకశేగులు, వాంపొళ్లు, సొండిగలు, సేవెలు, సోలిగలు ఇలా పిలుస్తారని అర్థం అవుతోంది. ఈ తెలుగు పేర్లన్నీ అదృశ్యం అయ్యాయంటే, ఆ మేరకు భాష మరణించిందని అర్థం.
చక్కిలాలు లేదా జంతికల ముక్కల్ని కారాలు, కారాసులు, మురుకులు అంటారు. తెలుగులో ‘మురు’ అంటే తునక. ఈ మురుకులకు బెల్లం పాకం పట్టిస్తే మనో హరాలు అనీ, ముద్దగా చేస్తే పూసమిఠాయి అనీ, లడ్డూ కడితే పూసలడ్డూ అనీ పిలుస్తారు.
‘‘మెఱసి యట్టుగ మీఁది చక్కిలాలు వెఱఁజి కైకొనె వీఁడె కదె / కఱమి కఱమి మనలు గంపల నురుగులు యెఱిఁగి దొంగెలెయీతఁడె కదవె’’ అనీ, ‘‘చక్కిలాలు నురుగులు జలజల రాలగాను / వుక్కుమీరి కొట్టి గృష్ణుడుట్లెల్లాను’’ అనీ అన్నమయ్య చక్కిలాల్ని ప్రస్తావించాడు. అన్నమయ్య కుమారుడు పెదతిరుమలయ్య ‘‘సతుల పెద్ద కొప్పులు చక్కిలాల గంప’’లన్నాడు. చక్కిలాలు, సకినాలు, సుప్పులు మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, మన హస్తకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉంటే, జంతికలు యాంత్రిక కళానైపుణ్యానికి చిహ్నంగా మొత్తం తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
మన సంస్కృతి, మన భాష, మన ఆహా రాలను పదిలపరచవలసిన బాధ్యత మనదే!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642