‘నకిలీ’ల గుట్టురట్టు
ABN , First Publish Date - 2020-11-10T14:43:38+05:30 IST
ఆధార్, పాన్, ఓటర్ కార్డులలో మార్పులు చేసి..

జిల్లావ్యాప్తంగా మీసేవా, నెట్ సెంటర్లలో తనిఖీలు
ఏడుగురి అరెస్ట్
నకిలీకార్డులు పొందిన వారినీ వదలం: ఎస్పీ
ఏడాది ముందే వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: ఆధార్, పాన్, ఓటర్ కార్డులలో మార్పులు చేసి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేయించి ప్రజాధనాన్ని దోచుకుంటున్న నకిలీ కార్డుల తయారీదార్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా మీసేవా, నెట్ సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా గుడివాడ, తిరువూరులో ఈ నకిలీ చర్యలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి ఏడుగురికి పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు రాబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చనే ఆశచూపి ఆధార్ కార్డుల్లో వయసు ఎక్కువ చూపుతూ పుట్టిన తేదీలను మార్పు చేస్తున్న అక్రమార్కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్న ఏడుగురిని తిరువూరు, గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ తన కార్యాలయంలోని సమావేశపు హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గుడివాడలో ఇద్దరి అరెస్ట్
గుడివాడలోని గౌరీశంకరపురానికి చెందిన చుండూరు రూపాసత్యసాయి కుమార్ శరత్ కమ్యునికేషన్ సెంటర్‌ను నడుపుతూ నకిలీ పాన్‌కార్డులు, ఆధార్ కార్డులు సృష్టిస్తున్నట్లు తొలుత గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. అతన్ని అరెస్టు చేసి విచారించిన సమయంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయన్నారు. సత్యసాయికుమార్‌కు గుడివాడ ఎస్‌బీఐలో ఆధార్‌కార్డుల రీసోర్సు పర్సన్‌గా పనిచేస్తున్న గుళ్లపల్లి సాయి అనే వ్యక్తి సహకరించినట్లు తెలిపారు. శరత్ కమ్యునికేషన్ నుంచి మూడు కంప్యూటర్లు, సెల్‌ఫోన్, గుళ్లపల్లి సాయి నుంచి ల్యాప్‌ట్యాప్, రెండు సెల్‌ఫోన్‌లు, 40 పాన్‌కార్డులు, 20 ఆధార్ కార్డులు, 15 ఓటర్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నకిలీ కార్డుల ద్వారా పింఛను, కాపునేస్తం, వైఎస్సార్ చేయూత పథకాలకు దరఖాస్తు చేసినట్లు గుర్తించామన్నారు. కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లను పరిశీలించి మరిన్ని వివరాలు రాబడతామన్నారు.
తిరువూరులో ఐదుగురి అరెస్టు
తిరువూరు, పరిసర ప్రాంతాల్లో పాన్‌కార్డులు, ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గజ్జల కోదండ సాయికృష్ణ (సాయి మీసేవ సెంటర్) అబ్దుల్ రెహమాన్ (బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ రీసోర్సు పర్సన్), ఆర్ కిషోర్, పి అయ్యప్ప, షేక్ సహీదా (కమీషన్‌పై పనిచేసే మధ్యవర్తు లు)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. మునిసిపల్, రెవెన్యూ అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారన్నారు. ఇప్పటి వరకు నకిలీ గుర్తింపు కార్డులు పొందినవారి వివరాలను అన్ని మండలాలు, పురపాలక సంఘాల నుంచి సేకరిస్తామని ఎస్పీ తెలిపారు. తయారీదారులనే కాకుండా పొందిన వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మీసేవా, నెట్‌సెంటర్లను పరిశీ లించి ఎవరైనా ఇలా నకిలీకార్డులు తయారు చేసి నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. నకిలీ తయారీదారులను గుర్తిం చడంలో ప్రతిభ కనపరచిన గుడివాడ డీఎస్పీ సత్యానందం, టూటౌన్ సీఐ దుర్గారావు, ఐటీ కోర్ కానిస్టేబుళ్లు గణేష్, సాయిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందిం చారు. ఈ సమావేశంలో ట్రైనీ డీఎస్పీ లు శ్రావణి, రమ్య, ఎస్‌బీ సీఐ నాగేంద్రకుమార్, డీసీఆర్‌బీ సీఐ రమేష్, పీసీఆర్ సీఐ అంకబాబు పాల్గొన్నారు.
ఏడాది ముందే వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
ఆధార్‌కార్డుల్లో వయసు పెంచి పించన్లు, ప్రభుత్వ పతకాలకు లబ్ధిదారులతో దరఖాస్తులు చేయిస్తున్న విషయంపై ఆంధ్రజ్యోతి కృష్ణాజిల్లా ఎడిషన్‌లో 2019 నవంబరు 19న ‘వయసు పెంచుతాం’ అనే శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అధికార పార్టీ నేతల్లో కొందరు ఈ తతంగం నడుపుతున్నట్లు బయటపెట్టింది. అప్పట్లో రెవెన్యూ అధికారులు కొన్ని మీసేవా సెంటర్లను తనిఖీ చేసి సరిపుచ్చారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుండటంతో ఎట్టకేలకు ఇప్పుడు మేల్కొన్నారు.
కోడూరులో ‘నకిలీ’ తయారీదారులు!
కోడూరు: నకిలీ పాస్ పుస్తకాల తయారీ దారుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. వీటి తయారీకి కేంద్రంగా మారి న కోడూరులో కొంతమంది ముఠాగా ఏర్పడి నకిలీ రైతుల నుంచి నగదు వసూలు చేసి ఒక్కొక్క పాస్ పుస్తకానికి రూ.5వేల నుంచి రూ.10వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. పొలాల రిజిస్ట్రేషన్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో రుణాలు యథేచ్ఛగా సాగిపోతు న్నాయి. గతంలోనూ ఇలాంటి నకిలీ పాస్ పుస్తకాలతో నాటి ఆంధ్రాబ్యాంక్‌లో సుమారు రూ.కోటి 50 లక్షలకు పైగా అప్పులు పెట్టారు. దీనిపై అప్పటి తహసీల్దార్ డి.వి.ఎస్.ఎల్లారావు పోలీసులకు తెలపగా వారు కేసులు పెట్టారు. సుమారు 40 మందికిపైగా నిందితులు కోర్టులో వాయిదాలకు తిరుగుతున్నాయి. అప్పటి తయారీదారులే ఇప్పుడు కూడా ఈ దందా చేస్తున్నట్లు సమాచారం రావటంతో పోలీసులు వీరి గుట్టురట్టు చేసి స్వాధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దందాను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలతో కలిసి ఒక పాత్రికేయ బృందం తయారీదారుల నుంచి భారీగా ముడుపులు సేకరించి పోలీసులతో బేరసారాలు చేసి కొంతమందిని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నెలక్రితమే పోలీసులకు సమాచారం వచ్చిన పూర్తి వివచారణ చేయించి ఇప్పుడు చర్యలు తీసుకున్నారు.
తహసీల్దార్ లతీఫ్ పాషా వివరణ
మందపాకలకు చెందిన పరిశె సుబ్బారావు అనే వ్యక్తి పాస్‌పుస్తకాలు అందిస్తామని రూ.20 వేలు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తహసీల్దార్ ఎస్.కె.లతీఫ్ పాషా తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తరువాత నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. రైతులెవరూ ఇలాంటి వారితో జాగ్రత్త ఉండాలని సూచించారు.