బెజవాడ టీడీపీ నేతలపై అధిష్ఠానం సీరియస్
ABN , First Publish Date - 2021-02-22T07:23:41+05:30 IST
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ పార్టీ..

వీధికెక్కొద్దు
రంగంలోకి దిగిన అచ్చెన్నాయుడు
బుద్దా, నాగుల్ మీరాతో సుదీర్ఘ భేటీ
మరోవైపు చంద్రబాబూ హెచ్చరికలు
ఎంపీ కేశినేని నానీకి ఫోన్!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ పార్టీ నేతలు అంతర్గత విభేదాలతో రచ్చకెక్కి మాటల యుద్ధానికి దిగడాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఇకపై పార్టీ నాయకులు బహిరంగంగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడిస్తే సహించేది లేదని హెచ్చరించింది.
వీఎంసీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ఎంపీ కేశినేని నాని బలపరుస్తుండగా, అదే డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కుమార్తె పూజితను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరాలు బలపరుస్తున్న సంగతి తెలిసిందే. ఒకే పార్టీ నుంచి ఇరువర్గాల నాయకులు అభ్యర్థులను నిలబెట్టి పోటాపోటీగా కార్యాలయాలను ప్రారంభించారు. ఇరువర్గాల నాయకులు పంతాలు, పట్టింపులకు పోతూ పరస్పరం వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఇరువర్గాల ఆధిపత్య పోరు వీధికెక్కింది.
మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గోగుల రమణరావును టీడీపీ అభ్యర్థిగా నానీ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వర్గం కూడా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని, ఆయనకు వ్యతిరేకంగా ఏకమైన వర్గం మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ శృతి మించుతూ పార్టీకే నష్టం చేసే స్థాయికి చేరుకోవడంతో టీడీపీ అధిష్ఠానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి అప్పగించింది. దీంతో అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం శ్రీకాకుళం నుంచి విజయవాడ చేరుకుని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో భేటీ అయ్యారు.
అచ్చెన్నాయుడి నివాసంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో విభేదాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ అభ్యర్థుల ఎంపికపై తమను సంప్రదించకుండా ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలు పోతున్నారని, పార్టీ గెలుపు కోసం పాటుపడుతున్న తమను సామంతరాజులంటూ విమర్శిస్తున్నారని వెంకన్న, నాగుల్‌మీరా తమ వాదనలు వినిపించినట్టు తెలిసింది. ప్రధానంగా 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఎంపికపై వారు గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవడం, లేదా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలే తప్ప ఇలా బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని, రెండు రోజుల్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడతామని, అంతవరకు బహిరంగ వేదికలపై గాని, మీడియా ముందుగాని ఈ విషయాలను మాట్లాడవద్దని అచ్చెన్నాయుడు సూచించారు.
సమావేశం అనంతరం బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెద్దల మాటకు గౌరవం ఇస్తూ, తమ కార్యాచరణను వాయిదా వేసుకున్నామని తెలిపారు. కాగా, బెజవాడ టీడీపీ పంచాయితీ వెనుక పెద్ద గూడుపుఠాణీ నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున, సోమవారం నుంచి మున్సిపల్ ఎన్నికలపై ఆయన దృష్టి సారించనున్నారు. రాష్ట్ర రాజధాని నగరాలైన విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ గెలుపును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఈ రెండు నగరాల్లోని పార్టీ నాయకుల మధ్య విభేదాలపై సీరియస్‌గా ఉన్నారు. సొంత పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీకి నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఇదే విషయమై ఆయన ఆదివారం విజయవాడ ఎంపీ కేశినేని నానీతో ఫోన్‌లో మాట్లాడినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు వేచి చూడాలని, వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని సూచించినట్లు తెలిసింది.