హిడ్మా చరిత్రలో కలిసిపోతాడు
ABN , First Publish Date - 2021-04-10T07:33:49+05:30 IST
బీజాపూర్‌లో అడవుల్లో వలపన్ని 22 మంది పోలీసులను హతమార్చిన గెరిల్లా దళ కమాండర్ హిడ్మా త్వరలో ‘చరిత్ర’లో కలిసిపోతాడని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్సింగ్ అన్నారు.

ఏడాదిలో నక్సల్స్‌ను ఏరేస్తాం: సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్
బీజాపూర్, ఏప్రిల్ 9: బీజాపూర్‌లో అడవుల్లో వలపన్ని 22 మంది పోలీసులను హతమార్చిన గెరిల్లా దళ కమాండర్ హిడ్మా త్వరలో ‘చరిత్ర’లో కలిసిపోతాడని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్సింగ్ అన్నారు. ఏడాది కాలంలో మావోయిస్టులను కూకటివేళ్లతో సహా ఏరిపారేస్తామన్నారు. అందుకు సంబంధించిన ఓ పకడ్బందీ కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. ఈ నెల 3న తెర్రాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ న్యూస్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మావోయిస్టులు ఇప్పటికే తమ ఉనికిని కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. ‘‘మా వాళ్లు అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ శిబిరాలను ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రాంతాలకూ చొచ్చుకుపోతారు. తప్పించుకోవడం మావోయిస్టులకు అసాధ్యం’’ అని వ్యాఖ్యానించారు. తాజా ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఎక్కువగా నష్టపోయాయనే వాదనను ఆయన ఖండించారు. మావోయిస్టుల వైపు ప్రాణనష్టం భారీగానే ఉందన్నారు.