Etela రాజేందర్ మాస్టర్ ప్లాన్.. TRS కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా.. ఇదే వర్కవుటయితే...!?
ABN , First Publish Date - 2021-11-23T18:22:21+05:30 IST
మాజీ మంత్రి రాజేందర్ సాధించాలనుకుంటున్న రెండు లక్ష్యాలు నెరవేరతాయా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీపై ఈటల ఎఫెక్ట్ బాగానే పడిందా? హుజురాబాద్‌లో ప్రచారం చేసిన టీఆర్ఎస్ ఇంఛార్జ్‌ల పనిపట్టేందుకు రాజేందర్ ఫోకస్ పెట్టారా..? వన్ షాట్ టూ బర్డ్స్ అన్న సామెతను ఈటెల రాజేందర్ అనుచరులు ఎందుకు గుర్తు చేస్తున్నారు..? మాజీ మంత్రి రాజేందర్ సాధించాలనుకుంటున్న రెండు లక్ష్యాలు నెరవేరతాయా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం..


బండి రాష్ట్ర పర్యటన.. ఈటల ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఫోకస్!
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తన పాదయాత్రను చివర్లో సొంత జిల్లా కరీంనగర్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో బిజేపీ గెలిచింది. గెలిచేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడితే ఎన్నికల నాటికి పరిస్థితి ఇంకాస్త ఈజీగా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు బీజేపీ లీడర్లు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై ఈటెల రాజేందర్ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ రాష్ట్రం మొత్తం తిరిగితే.. ఈటెల రాజేందర్ కరీంనగర్‌లోని మెజార్టీ స్థానాల్లో ప్రచారం చేయొచ్చన్న ఆలోచన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇటు గంగుల టార్గెట్‌గా.. అటు కొప్పులకు పోటిగా!
కరీంనగర్ జిల్లాలో ఈటల ప్రధాన శత్రువుగా మంత్రి గంగుల కమలాకర్ పేరు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత గంగుల కమలాకర్‌తో మాటల యుద్ధం నడిచింది. కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ సాధించిన మంత్రిని ఓడించడం మాజీ మంత్రి ముందున్న పెద్ద టార్గెట్‌గా టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోనే మరోమంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుంచి చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచారంటారు జనం. ధర్మపురి అసెంబ్లీ నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ, బిజేపీ నేత వివేక్ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. వివేక్ కూడా ఈటెల రాజేందర్‌కు సన్నిహితుడు కావడంతో ఆ నియోజకవర్గంపైనా ఈటెల రాజేందర్ గట్టిగా ప్రయత్నం మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది.

తుల ఉమను ఈటల ఎమ్మెల్యే చేస్తారా?
వేములవాడ నియోజకవర్గంపైనా ఈటెల వర్గం ప్రత్యేక దృష్టి పెట్టిందనే మాటలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్లో ఉన్నపుడు తుల ఉమ వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డారు. వేములవాడ సీటు కండీషన్ మీదే ఈటలతో కలిసి ఆమె బిజేపీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది. ఈటెలకు తుల ఉమ అత్యంత సన్నిహితురాలు. అయితే వేములవాడ నుంచి మున్ముందు బిజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోటీ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఆమెను మరో స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నారట.

ఈటల రిట్న్ గిఫ్ట్ ఇస్తారా?
ఈటెల రాజేందర్‌కు ముందునుంచీ సన్నిహితంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు కేసీఆర్ 2018లో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె బిజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈటల కోసం హుజురాబాద్‌లో కలియతిరిగిన శోభకు చొప్పదండి టికెట్ ఇప్పించుకోవడానికి మాజీ మంత్రి ప్రయత్నిస్తారనే ప్రచారం ఎక్కువవుతోంది. మరోవైపు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హుజురాబాద్‌లో ప్రచారం చేసి తనను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలకు రిటర్న్ గిఫ్ట్‌గా ఆయన్ను ఓడించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఈటలది వన్‌షాట్ టూ బర్డ్స్ ఫార్ములా..!
కరీంనగర్ జిల్లాలో పటిష్టంగా ఉన్న గులాబీ పార్టీకి ఈటెల రాజేందర్ రూపంలో కొత్త కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గానికి ఇంఛార్జీలుగా వచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల భరతం పడతానని అనేక సార్లు ప్రకటించారు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడతానని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ చేసిన ఆ వ్యాఖ్యల వెనుక రెండు ప్రధాన లక్ష్యాలున్నట్లు బిజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. తన నియోజకవర్గానికి వచ్చి తనను ఓడించేందుకు ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలను ఓడించడం తొలి లక్ష్యం కాగా.. తనకు అండగా నిలబెడ్డవారిని పార్టీ టికెట్‌పై గెలిపించుకోవడం రెండో లక్ష్యమనే టాక్ వస్తోంది.
