రాష్ట్ర వ్యాప్తంగా ‘సంగం’ సేవల విస్తరణ
ABN , First Publish Date - 2022-12-20T00:33:39+05:30 IST
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ సంగం డెయిరీ సేవలను విస్తరించేలా పాలకవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు.

చేబ్రోలు, డిసెంబరు 19: రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ సంగం డెయిరీ సేవలను విస్తరించేలా పాలకవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. సోమవారం వడ్లమూడి సంగం డెయి రీలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సంగం ప్లాంటును ఆధునికీకరణ చేసి పాల సేకరణ సామర్ధ్యాన్ని ప్రస్తుత 7 లక్షల లీటర్ల నుంచి 12 లక్షలకు పెంచాలని పాలకవర్గం నిర్ణయించింది. పాల రైతులకు అందిస్తున్న సంగం పశుదాణా కర్మాగారాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. సంగం దాణా కర్మాగారం సామర్ధ్యం 100 మెట్రిక్ టన్నులు కాగా దానిని 200 మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు తెలిపారు. నెల్లూరు, విశాఖపట్టణం, తెలంగాణలో ఈ శాటిలైట్ డెయిరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రాజుపాలెం మండలంలో చిల్లింగ్ సెంటర్‌ను ప్రారంభించామని, త్వరలోనే అనంతపురంలో రెండు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశవాళి ఆవులు, పశువుల్లో సమృద్ధిగా లభించే ఎ2 ప్రొటీన్ కలిగిన పానీయాన్ని, పాల ఉప ఉత్పత్తుల నుంచి వచ్చే స్రవాల నుంచి ఎనర్జీ డ్రింక్‌లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు అధునాతన యంత్ర పరికరాలను సమకూర్చుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని రాజమండ్రితో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో కూడా ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ప్రారంభించామన్నారు. ఇటీవల పశు సంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంగండెయిరీపై చేసిన ఆరోపణలు రాజకీయపరమైనవే తప్ప మరొకటి కాద న్నా రు. సంగం డెయిరీ ప్రతిష్ఠను దిగజార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ద్వారా అనేక కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. ఎన్‌డీడీబీపై ఎన్నో రకాల ఒత్తిళ్లు తీసుకుని వచ్చినప్పటికీ వినియోగదారులు, రైతుల అండతో సంగం డెయిరీ ప్రగతి పథంలో సాగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.