చంద్రబాబు టార్గెట్‌గా సాగిన కుప్పం జగన్ సభ..
ABN , First Publish Date - 2022-09-23T20:12:44+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇవాళ సీఎం జగన్ (CM Jagan) పర్యటించారు.

Kuppam : టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇవాళ సీఎం జగన్ (CM Jagan) పర్యటించారు. ఆయన కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు ముందుగానే వచ్చాయి. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించి.. ఎలాగైనా ఈ సారి పాగా వేయాలని ఒక టార్గెట్‌ను జగన్ ఫిక్స్ చేసుకున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టార్గెట్‌కు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు టాక్. అయితే నేడు జగన్ కుప్పం పర్యటనకు వస్తున్నారంటే అక్కడ ప్రజలపై ఏవో వరాల జల్లు కురిపిస్తారని భావించారంతా. కానీ సీన్ రివర్స్. చంద్రబాబును విమర్శించడానికే జగన్ సమయమంతా కేటాయించారు. చంద్రబాబు అలా చేశారు.. ఇలా చేశారంటూ విమర్శల బాణాలు సంధించడంపైనే ఎక్కువగా జగన్ దృష్టి సారించారు.
కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రూ.11 కోట్లతో ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ.. ‘‘కుప్పంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదు. వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. కుప్పం అంటే అక్కచెల్లెమ్మల అభివృద్ధి. కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ (Hyderabad)కు లోకల్. కుప్పానికి చంద్రబాబు నాన్ లోకల్. కుప్పానికి ఆయన చేసిందేమీ లేదు. తనకు కావాల్సింది కుప్పం నుంచి పిండుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేదు.
కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు... కుప్పానికి కనీసం నీళ్లు కూడా తీసుకురాలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేదు. కృష్ణగిరి- పలమనేరు హైవే పనుల్ని చేయలేదు. కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతామని చెవుల్లో పూలు పెట్టారు. ప్రజల ఒత్తిడితో రెవెన్యూ డివిజన్ కోసం నాకు చంద్రబాబు లేఖ రాశారు. ఇంతకన్నా చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటారా? ఒక్కసారి కూడా కుప్పం సీటు బీసీలకు ఇవ్వలేదు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు లేదు, ఓటు లేదు. హైదరాబాదే ముద్దు అని చంద్రబాబు భావించారు. అందుకే హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టుకున్నారు’’ అని జగన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.