నగర రోడ్లపై దూసుకు పోయిన కారు

ABN , First Publish Date - 2022-12-22T23:47:44+05:30 IST

: ఓ కారు గురువారం మధ్యాహ్నం నగర రహదారులపై అతి వేగంతో దూసుకుపోయింది. అడొచ్చిన వారిని ఢీకొంటూ పోవడంతో పలువురు గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఏఆర్‌ ఎస్‌ఐ కుమారుడిదే ఈ నిర్వాకం.

నగర రోడ్లపై దూసుకు పోయిన కారు
నవాబుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

నెల్లూరు(క్రైం), డిసెంబరు 22: ఓ కారు గురువారం మధ్యాహ్నం నగర రహదారులపై అతి వేగంతో దూసుకుపోయింది. అడొచ్చిన వారిని ఢీకొంటూ పోవడంతో పలువురు గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఏఆర్‌ ఎస్‌ఐ కుమారుడిదే ఈ నిర్వాకం. పోలీసుల సమాచారం మేరకు చిన్నబజారులో ఏఆర్‌ఎస్‌ఐ కుటుం బం నివాసం ఉంటోంది. ఆయన కుమారుడు పృథ్వీరాజ్‌ గురువారం పూటుగా మద్యం తాగి తన స్నేహితుడు విఘ్నేష్‌తో కలిసి కారులో గాంధీబొమ్మ నుంచి కనకమహల్‌వైపు అతి వేగంతో కారును నడుపుతూ అడ్డొచ్చిన పలువురిని గాయాలపాలు చేశారు. స్థానికులు కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని సైతం ఢీకొట్టేందుకు పూనుకున్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించి కారును వెంబడించారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆత్మకూరు బస్టాండు వద్ద కారును ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా సినిమా తరహాలో వేగంగా దూసుకెళ్లింది. ట్రాఫిక్‌, నవాబుపేట పోలీసులు, స్థానికులు అతి కష్టంమీద పప్పులవీధిలో కారును అడ్డుకున్నారు. నవాబుపేట పోలీసులు కారును, అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. అంత రచ్చ చేసి కూడా ‘మా నాన్న పోలీసు అధికారి మీ కథ తేలుస్తా అంటూ పృథ్వీరాజ్‌ బెదిరింపులకు పాల్పడ్డాడని స్థానికులు తెలుపుతున్నారు. ఆగ్రహించిన స్థానికులు కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనలో పలువురు గాయపడ్డా ఒక బాధితుడైన నారాయణ రెడ్డిపేటకు చెందిన బి. బాలమురళి తొలుత నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులకు తొలుత ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన ప్రదేశం సంత పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోకి రావడంతో బాధితుడు మళ్లీ ఆ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పృథ్వీరాజ్‌తో పాటు అతని స్నేహితుడికి డ్రంకెండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-22T23:47:58+05:30 IST