పెచ్చరిల్లిన అవినీతి

ABN , First Publish Date - 2022-10-29T00:04:00+05:30 IST

జిల్లాలో ఇటీవల వరుసగా ఏసీబీ నిర్వహించిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అద్దం పడుతున్నాయి.

పెచ్చరిల్లిన అవినీతి

పెచ్చరిల్లిన అవినీతి

పైసలివ్వందే ఫైలు కదలదు

ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు అధ్వానం

అధికారపార్టీ అండదండలతో రెచ్చిపోతున్న అధికారులు

జిల్లాలో వరుసగా అవినీతి నిరోధక శాఖ దాడులు

అయినా తగ్గని వసూళ్ల పర్వం

ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 14400

రెండు నెలల క్రితం ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆర్‌ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఒక ఆస్తికి పన్ను వేసే విషయంలో ఆయన భారీగా డబ్బు డిమాండ్‌ చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.

ప్రతి పనికీ డబ్బులు అడుగుతున్నారన్న ఫిర్యాదు మేరకు ఆగస్టులో మార్కాపురం మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వయంగా భవనాలను పరిశీలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 10న తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ కార్యదర్శి స్థానిక ఉపసర్పంచ్‌ చేసిన పనులకు బిల్లులు చేసేందుకు రూ.30వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఈనెల 13న గిద్దలూరు మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, అతని అసిస్టెంట్‌ రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇలా ఒకటేమిటి ఎస్‌ఈబీ అధికారి, తహసీల్దార్‌, వీఆర్వోలు, పోలీసు అధికారులు డబ్బులు తీసుకుంటూ దొరికిన ఘటనలు ఉన్నాయి.

జిల్లాలో ఇటీవల వరుసగా ఏసీబీ నిర్వహించిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అద్దం పడుతున్నాయి. కాసులు పడందే ఫైలు కదలని పరిస్థితి. దీంతో సామాన్యులు నలిగిపోతున్నారు. ఒకవేళ నాయకులతో సిఫార్సు చేయించుకున్నా సరే బరువు పడకుండా ఏపనీ కావడం లేదు. అధికారపార్టీ అండదండలతో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఒకపక్క ఏసీబీ దాడులు జరుగుతున్నా వారు మాత్రం భయపడటం లేదు.

ఒంగోలు (క్రైం), అక్టోబరు 28 : ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిమయంగా మారాయి. అధికారులు, ఉద్యోగులు ప్రతి పనికీ డబ్బులు డిమాండ్‌ చేస్తూ ప్రజలను జలగల్లా పీక్కుతింటున్నారు. దళారులు లేకుండా ఏకార్యాలయంలోనూ సామాన్యులకు చిన్న పని కూడా కావడం లేదు. రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద దళారులు రాజ్యమేలుతుండగా.. రవాణా, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద ఏజెంట్లు, డాక్యుమెంటు రైటర్లు చక్రం తిప్పుతున్నారు. పోలీసు స్టేషన్ల వద్ద కూడా కొంతమంది అధికారపార్టీ నాయకులు హవా నడిపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో స్టేషన్‌కు ఒకరిద్దరు కానిస్టేబుళ్లు ప్రత్యేక ఏజెంట్లుగా మారి పోలీసు అధికారులకు వసూలు పనులు చక్కబెడుతున్నారు. ఇక ఇంజనీరింగ్‌ విభాగాల్లో అయితే నేరుగా పర్సంటేజీల పేరుతో కాంట్రాక్టర్‌ల వద్ద ముందే వసూలు చేయడం పరిపాటైంది.

రెవెన్యూదే అగ్రతాంబూలం

ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. క్షేత్రస్థాయి నుంచి తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల వరకు చివరకు కలెక్టరేట్‌లోనూ ప్రతి పనికీ ఓ రేటు నడుస్తోంది. ఆ మేరకు ఇస్తేనే ఫైలు కదులుతోంది. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, భూముల ఆన్‌లైన్‌, సర్వేలతోపాటు సచివాలయాల నుంచి ఇచ్చే సర్టిఫికెట్ల వరకు ఇదే తంతు. ఈ అవినీతి వ్యవహారాల నేపథ్యంలో వీఆర్వోలు ఏసీబీకి చిక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే సర్వేయర్లు, ఆర్‌ఐలు, డీటీలు, తహసీల్దార్లు కూడా పట్టుబడ్డారు. అయినా ఆ శాఖలో ఎటువంటి మార్పు లేదు.

అవినీతికి కేరాఫ్‌ మున్సిపల్‌ కార్యాలయాలు

జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌ నుంచి నగర పంచాయతీల వరకూ అవినీతికి కేరాఫ్‌గా మారాయి. బిల్డింగ్‌ ప్లాన్ల విషయంలో దళారుల ప్రమేయం అధికంగా ఉంటోంది. వారే వ్యవహారం మాట్లాడి సెటిల్‌ చేస్తారు. ప్లాన్‌ అప్రూవల్‌ నుంచి పన్నుల విధింపు వరకూ లక్షలాది రూపాయల మామూళ్లు ఇవ్వాల్సిందే. అలాగే పన్ను వేయించుకోవాలన్నా, మంచినీళ్ల కొళాయి కనెక్షన్‌ కావాలన్నా అడిగినంత సమర్పించాల్సిందే. ఇక్కడ కిందినుంచి పైస్థాయి వరకు వాటాలు మామూలైపోయింది. దీంతో సామాన్యులు వణికిపో తున్నారు. పనులు చేయించుకోవాలని నేరుగా కార్యాలయాలకు వెళితే అక్కడ ఫైళ్లు ముందుకు కదలవు. ఇలా నేరుగా ఉద్యోగులే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనలు చాలా ఉన్నాయి.

రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఒక రేటు

రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రతిపనికీ ఒక రేటు నిర్ణయించి ఏజెంట్లు సామాన్యులను లూటీ చేస్తున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌ నుంచి, డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల ఫిట్‌నెస్‌లు నిత్యం జరుగుతుం టాయి. నేరుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని లైసెన్స్‌ల కోసం వెళితే అక్కడ కచ్ఛితంగా ఫెయిల్‌ కావడం ఖాయం. అదే ఏజెంట్‌ కోడ్‌తో వెళితే పాస్‌ గ్యారెంటీ. అందుకే దాదాపు అందరూ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.410 ప్రభుత్వానికి చలనా రూపంలో చెల్లించాలి. అయితే ఏజెంట్లు రూ.1500 వసూలు చేస్తున్నారు. అందులో రూ.600 అక్కడ ఇన్‌స్పెక్టర్లకు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. అదేవిధంగా హెవీ లైసెన్స్‌కు రూ.7వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీనిలో రూ.1500 మాత్రమే చలానా కట్టాల్సి ఉంది. ఇక వాహనాల ఫిట్‌నెస్‌ అయితే రూ.2,500నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు.

రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఫీజ్‌ టూ ఫీజ్‌

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లదే పెత్తనం. అధికారుల అండదండలతో వారు లావాదేవీలు నడుపుతున్నారు. వారు చెప్పిందే రేటు. ఎటువంటి రిజిస్ట్రేషన్‌ చేయాలన్నా రైటర్లు ఇట్టే పనికానిచ్చేస్తారు. నిమిషాల్లో వ్యవహారాలను చక్కబెట్టేస్తారు. అందుకు సంబంధించి ఫీజ్‌ టూ ఫీజ్‌ నడుస్తోంది. ఒక డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌కు సుమారు రూ.50వేలు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటే అక్కడ కార్యాలయంలో మరో రూ.50వేలు అదనంగా సమర్పించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. అంతేకాదు మార్కెట్‌ విలువ తగ్గింపు పేరుతో మాయాజాలం చేసి డాక్యుమెంట్‌ రైటర్లు అధికారులతో కుమ్మక్కే ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతున్నారు.

పోలీసు శాఖలో 41 సీఆర్‌పీసీ పంట

పోలీసు శాఖలో అన్నింటికంటే 41 సీఆర్‌పీసీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే కేసులతో పంట పండుతోంది. ప్రతి కేసులో బెయిల్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరి వద్ద రూ.10వేలు తగ్గకుండా వసూలు చేయడం సర్వసాధారణమైంది. చిన్నచిన్న ఫిర్యాదులపై విచారణ కోసం పిలిచి రాజీలు చేసి ఇరుపక్షాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. సివిల్‌ కేసులు సెటిల్‌మెంటు చేసి లక్షల్లో దండు కుంటున్నారు. రాత్రివేళ ఎవరినీ స్టేషన్‌లో ఉంచకూ డదన్న నిబంధన కూడా పోలీసులకు వరంగా మారిం ది. రాత్రి ఇంటికి పంపినందుకు నజరానా ముట్టాల్సిం దే. ఇక ఎస్‌ఈబీ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదాడి చేసినా డబ్బులే. అక్రమ రవాణా కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది ఒక సీఐ, ఒక కానిస్టేబులు ఏసీబీకి దొరకడమే అందుకు నిదర్శనం.

ఇంజనీరింగ్‌ విభాగాల్లో పర్సంటేజీలు

ఇంజనీరింగ్‌ విభాగాల్లో పర్సంజేజీ మామూలైపోయింది. ఎక్కడ నిర్మాణ పనులు చేపట్టినా 20 నుంచి 30శాతం ఇటు అధికారులకు అటు అధికారపార్టీ నేతలకు ముట్టజెప్పాల్సిందే. ఇలా వసూలు చేసిన మొత్తం కేడర్‌ వారీగా ఆయా కార్యాలయాల్లో సర్దు బాట్లు జరుగుతాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారం నిర్మాణపనులు చేసినా అధికారులు పట్టించుకోరు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవడం తోపాటు జనానికి పారదర్శకంగా సేవలందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-10-29T00:04:04+05:30 IST