బంతి పైపైకి..
ABN , First Publish Date - 2022-10-24T00:52:22+05:30 IST
దీపావళి పండగ, కార్తీకమాసం రాక నేపథ్యంలో మన్యంలోని బంతి పూలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో కేవలం పది కిలోలుండే బుట్ట బంతి పూలు రూ.450 చొప్పున ఆదివారం పాడేరులో వర్తకులు కొనుగోలు చేశారు. ఊహించని రీతితో ధర పెరగడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- అమాంతం పెరిగిన పూల ధర
- బుట్ట పువ్వులు రూ.450
- ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వర్తకుల రాకతో విపరీతంగా పెరిగిన రేటు
- కొనుగోలుకు ఎగబడుతున్న వ్యాపారులు
- ఆనందంలో గిరిజన రైతులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
దీపావళి పండగ, కార్తీకమాసం రాక నేపథ్యంలో మన్యంలోని బంతి పూలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో కేవలం పది కిలోలుండే బుట్ట బంతి పూలు రూ.450 చొప్పున ఆదివారం పాడేరులో వర్తకులు కొనుగోలు చేశారు. ఊహించని రీతితో ధర పెరగడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు మండలంతో పాటు ఆనుకుని ఉన్న హుకుంపేట, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజన రైతులు ప్రతి ఏడాది బంతి పూలను సాగు చేస్తుంటారు. అక్టోబరు మూడో వారం నుంచి దాదాపుగా డిసెంబరు మొదటి వారం వరకు పాడేరులో బంతి పూల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అయితే కార్తీకమాసంలో అయ్యప్ప భక్తులు, ప్రత్యేక పూజల నేపథ్యంలో బంతి పూల కొనుగోలు జోరుగా జరుగుతుంటాయి. అయితే సీజన్ ప్రారంభంలో పది కిలోలుండే బుట్ట పూలు రూ.150 నుంచి రూ.200 ధరతో వర్తకులు కొనుగోలు చేసుకునేవారు. అలాగే సీజన్ ముగిసే నాటికి అదే బుట్ట పూలు రూ.50 నుంచి రూ.100లకు ధర దిగజారడం సర్వసాధారణం. కొన్ని సార్లు అధికంగా బంతి పూలు మార్కెట్‌కు వస్తే కొనుగోలు చేసేవారు లేక, రైతులు వాటిని పారబోసిన సందర్భాలున్నాయి. అటువంటి పరిస్థితిని గిరిజన రైతులు అనుభవించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ధర పెరగడంతో పాటు వాటి కొనుగోలుకు వర్తకులు ఎగబడుతుండడంతో గిరిజన రైతుల ఆనందానికి అవధుల్లేవు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వర్తకుల రాకతో..
పాడేరులో బంతి పూలు కొనుగోలు చేసేందుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు రావడంతో ధర రికార్డు స్థాయిలో పెరిగిందని రైతులు తెలిపారు. ఇన్నాళ్లూ అనకాపల్లి, నర్సీపట్నం, తుని, కాకినాడ ప్రాంతాలకు చెందిన వర్తకులు వచ్చి గిరిజన రైతుల వద్ద బంతి పూలు కొనుగోలు చేసేవారు. వాటిని రాత్రికి రాత్రి వాహనాల్లో రాజమహేంద్రవరం, విజయవాడ, తుని, ఏలూరులోని పూల మార్కెట్లకు తరలించేవారు. అయితే ఈ వారం అనుకోని విధంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు రావడంతో ధర రెండింతలు పెరిగిపోయింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బంతి పూల సాగు లేకపోవడంతో ఎంత ధరకైనా పూలను కొనుగోలు చే సేందుకు ముందుకు రావడంతో ధర పెరిగిందని రైతులు అంటున్నారు.
మన్యం బంతి పూలకు భలే డిమాండ్
ఏజెన్సీలో సహజ సిద్ధంగా సాగు చేసే బంతి పూలకు ఇతర ప్రాంతాల్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో పువ్వులు కోసిన రెండు, మూడు రోజుల్లో వాడిపోతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పూలను ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌లకు సకాలంలో రవాణా చేయకపోతే వర్తకులు నష్టపోయే ప్రమాముంది. అదే ఏజెన్సీలోని పూలైతే కోసిన వారం రోజులకు గాని వాడిపోవు. అందువల్ల ఇక్కడ కొనుగోలు చేసిన పూలను ఎక్కడికైనా ఎటువంటి భయం లేకుండా రవాణా చేసుకోవచ్చుననే ఽధీమాతో వర్తకులు వాటిని కొనుగోలు చేసుకునేందుకు ఎగబడుతుంటారు.