‘అమ్మఒడి’ నిండేందుకు ఇన్ని అడ్డంకులా!
ABN , First Publish Date - 2022-06-21T06:32:36+05:30 IST
వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం తదుపరి నగదు బదిలీ నేడు (జూన్ 21) జరుగబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పథకంలో భాగంగా...
వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం తదుపరి నగదు బదిలీ నేడు (జూన్ 21) జరుగబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పథకంలో భాగంగా రూ.15 వేల నగదుకు బదులుగా రూ.13 వేలు మాత్రమే లబ్ధిదారులకు బదిలీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన, అర్హులందరూ ‘ఈ– కెవైసీ’ చేయించుకోవాలనే నిబంధన లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తల్లులు, పిల్లలూ బ్యాంకుల ముందూ, సచివాలయాల ముందు పడిగాపులు కాస్తూ కనిపిస్తున్నారు.
నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకం 2020 జనవరిలో ప్రారంభమైంది. కొన్ని నియమాలకు లోబడి, ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు బడికి వెళ్లే పిల్లల తల్లులకు, వీరు లేని పక్షంలో తండ్రుల బ్యాంకు అకౌంటుకు రూ.15వేలు బదిలీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అమ్మఒడి పథకం డ్రాప్ అవుట్లను నివారిస్తుందని, విద్యలో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. రెండవ విడత అమ్మఒడి నగదు బదిలీ జనవరి 2021లో జరిగింది. అర్హులైన వారి బ్యాంకు అకౌంట్లకు రూ.15వేల నగదు బదిలీ జరిగింది. అయితే చివరికి నగదు బదిలీ జరిగే సమయానికి మాట మార్చి పాఠశాల బాగు చేయించటానికి అని చెప్పి ఒక వెయ్యి రూపాయలను వెనక్కు తీసుకున్నారు. అంటే రూ.15వేలకు బదులుగా లబ్ధిదారులకు రూ.14వేలు మాత్రమే అందాయి.
మొదటి రెండు సార్లు నగదు బదిలీ బాధ్యతను పాఠశాల విద్యాశాఖ తీసుకుంది. ఈసారి ఈ బాధ్యతను గ్రామ వాలంటీర్లుకు/సచివాలయం శాఖకు అప్పగించారు. ఇలా అప్పగించడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం చెప్పలేదు. అలాగే ఈసారి అమ్మఒడి పథకానికి అర్హులు కావాలంటే లబ్ధిదారులు ఏడు అంచెల ధృవీకరణలో ఉత్తీర్ణులు కావాలి. లబ్ధిదారుల కుటుంబాల వార్షిక ఆదాయం, వారికి గల భూమి విస్తీర్ణం, వారి విద్యుత్తు వినియోగం, వారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులా కాదా అన్నది, ప్రభుత్వ అధికారుల కుటుంబాలకు చెందినవారా కాదా అన్నది, నాలుగు చక్రాల వాహనాల యజమానులా కాదా అన్నది (టాక్సీ నడిపే వారిని మినహాయించారు), మునిసిపల్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందా అన్నది... ఇలాంటివి మొత్తం ఏడు అంచెల ధృవీకరణలు ఉన్నాయి. వీటిని అనర్హుల ఏరివేత కోసమే ఉద్దేశించినట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ ఈ అనర్హతల్ని ప్రభుత్వం దగ్గర ఉన్న డిజిటల్ డేటా ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఇది అనేక సమస్యలకు తావునిస్తున్నది. ఉదాహరణకు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ భూమి రికార్డులు చనిపోయిన వారి పేర్లపైన మాత్రమే ఉన్నాయి. మ్యుటేషన్లు జరగలేదు. వ్యవసాయక కుటుంబాలు భూమిని విభజించుకున్నా ఆ విభజన భూమి రికార్డులలో ప్రతిబింబించటం లేదు. దీనివల్ల చాలా కుటుంబాలు అమ్మఒడి పథకానికి అర్హత సంపాదించలేకపోతున్నాయి. డిజిటల్ డేటా సెట్లలో తప్పులను సరిదిద్దుకోవడం లబ్ధిదారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ ఏడంచెల ధ్రువీకరణ దాటినంత మాత్రాన డబ్బులు అకౌంటులో పడతాయనే గారంటీ లేదు. ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్నా సరే తల్లీ, పిల్లలకు చెల్లుబాటు అయ్యే ఆధార్ ఉండాలి. ఇద్దరి పేర్లూ రేషన్‌కార్డులలో ఉండాలి. ప్రభుత్వ చైల్డ్ ఇన్ఫో పోర్టల్‌లో సరైన వివరాలతో నమోదు అయ్యుండాలి.
ఇన్నింటిలో ఏ ఒక్క తేడా జరిగినా అమ్మఒడి డబ్బు వచ్చే అవకాశం లేదు. పథకానికి అర్హులైన వారు తమ వాలంటీర్ యాప్‌లో వేలిముద్రలు వేసి తమ ‘ఈ–కేవైసీ’ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నియమం వలన రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది లబ్ధిదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 43.2లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, జూన్ 20 నాటికి ఇంకా 1.53 లక్షల మంది ‘ఈ–కేవైసీ’ చేయించుకోలేదు. అంటే వీరికి అమ్మఒడి నుండి లబ్ధి పొందే అవకాశం లేనట్టే. ఇక ‘ఈ–కేవైసీ’ పూర్తి చేసుకున్న వారిలో ఆధార్ సమాచారంలో తప్పులు ఉండడం, రేషన్‌కార్డు వివరాలు సక్రమంగా ఉండకపోవడం తదితర కారణాల వలన ఎంతమంది కోల్పోతారో నగదు బదిలీ జరిగేవరకూ తెలియదు.
ఇప్పటివరకూ అమ్మఒడి నగదు బదిలీ బ్యాంకు అకౌంట్ పేమెంట్ పద్ధతిలో జరిగింది. ఈ పద్ధతిలో ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు అకౌంటు వివరాలను సేకరించి ఆ బ్యాంకు అకౌంటుకు నగదును బదిలీ చేస్తుంది. ఐతే ఈ సంవత్సరం ఈ పద్ధతికి స్వస్తి పలికి ఏకపక్షంగా ఆధార్ పేమెంట్ పద్ధతిని తీసుకువచ్చారు. అందుకు కారణాలేమిటో పేర్కొనలేదు. ఈ విషయమై ఆర్థిక శాఖ–తల్లిదండ్రులతో పాటు కనీసం విద్యాశాఖను, గిరిజన సంక్షేమ శాఖను సైతం సంప్రదించలేదని మేము సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన సమాచారం చెబుతోంది.
ఆధార్ పేమెంట్ పద్ధతిలో లబ్ధిదారుల బ్యాంకు అకౌంటు ఆధారంగా కాక వారి ఆధార్ నెంబరు ఆధారంగా నగదు బదిలీ జరుగుతుంది. ఇలా జరగాలంటే లబ్ధిదారుల బ్యాంకు అకౌంటుకు ఆధార్ నెంబరుతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీలకు కావాల్సిన ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ కు లింక్ అవ్వాలి. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రతి ఏటా రాష్ట్రంలో లక్షలమంది ఈ NPCI లింకింగ్ సమస్య వలన రైతు భరోసా తదితర పథకాల లబ్ధిని పొందలేకపోతున్నారు. అసలు ఈ NPCI లింకింగ్ ప్రక్రియ గురించి బ్యాంకు అధికారులకు సైతం పూర్తి అవగాహన లేదని మా పరిశీలనలో తేలింది. నగదు బదిలీని ఆధార్ పేమెంట్ పద్ధతికి మార్చడం వలన రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తమ అమ్మఒడి పథకం నగదును కోల్పోతారు. మానవ హక్కుల వేదిక లాంటి ప్రజాసంఘాలు ఈ చర్యని తప్పు పట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొన్ని సచివాలయాలలో ఐతే 25శాతానికి మించి లబ్ధిదారులకు NPCI మాపింగ్ జరగలేనట్లు తెలుస్తుంది.
గత రెండేళ్లలో అమ్మఒడి పథకానికి ప్రభుత్వం కేటాయించిన రూ.6,500 కోట్లలో మొదటి సంవత్సరం రూ.6,100 కోట్లు, రెండవ సంవత్సరం, రూ.6,300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక ఈ ఏడాది అందాల్సిన నగదును రూ.15 వేల నుంచి రూ.13 వేలకు తగ్గించటం ద్వారా ఖర్చు మరింత తగ్గించడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అలానే 2021లో 43.55 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 43.2 లక్షల(దాదాపు 35,500) మందికి ఎందుకు తగ్గిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఈ పరిస్థితి అంతా చూస్తే ఏదో ఒకటి చేసి అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అనిపించక మానదు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 21–ఎ సవరణ ప్రకారం విద్యని ప్రాథమిక హక్కుగా చేర్చారు. 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ‘అందరికీ’ ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. పిల్లలందరికీ విద్యను అందించాల్సిన ప్రభుత్వం– ‘అమ్మఒడి’ పథకానికి అర్హత పొందే ప్రక్రియను సంక్లిష్టం చేసి ప్రజల విలువైన పని గంటలను, మానసిక ప్రశాంతతను హరించడం సబబేనా? అలానే ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత కేవలం 67శాతమే ఉంది; అందులో ఆదివాసీలు, దళితులలో అక్షరాస్యత శాతం మరింత తక్కువ. ఇక అందులో డిజిటల్ అక్షరాస్యులు ఎందరు? బాంకు లింకేజీ, ఆధార్ అనుసంధానం... ఇవన్నీ అర్థమయ్యేది ఎంతమందికి? ఇలాంటి అంశాలను పరిగణించకుండా పథకాలను అందించే పద్ధతులను డిజైన్ చేయడం ఎవరికోసమో ప్రభుత్వాలు చెప్పాలి.
ఎలాంటి పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా అర్హులైన లబ్ధిదారుల సంఖ్యను కుదించడం, పథకాల బెనిఫిట్స్ కుదించడం ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. ఈ పరిస్థితి మారాలంటే సంక్షేమం భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుగా గుర్తించి సంక్షేమ పథకాలను చట్టపరమైన చట్రం లోనికి తీసుకురావాలి. సంక్షేమ పథకాల బదిలీ ప్రక్రియకు సంబంధించి పారదర్శకతతోను, జవాబుదారీతనంతోను కూడిన ఫ్రేంవర్‌్కను రూపొందించాలి. అప్పుడు మాత్రమే అవి ఉద్దేశించిన లక్ష్యాలు చేరుకోగలుతాయి.
చక్రధర్ బుద్ధ
హరి వెంకట రమణ