BF7 Sub Variant: చైనాని వణికిస్తోంది.. ఇండియాలో ఎంటరైపోయింది.. ఈ బీఎఫ్‌.7 లక్షణాలివే..!

ABN , First Publish Date - 2022-12-21T21:32:11+05:30 IST

చైనాలో (China) కరోనా (Corona) మరోసారి కల్లోలం రేపుతోంది. రూపం మార్చుకుని వైల్డ్ ఫైర్‌లా వ్యాపిస్తోంది. ఒమైక్రాన్‌తో ముగిసిపోయిందనుకున్న కొవిడ్‌ మళ్లీ కొత్త రూపంలో..

BF7 Sub Variant: చైనాని వణికిస్తోంది.. ఇండియాలో ఎంటరైపోయింది.. ఈ బీఎఫ్‌.7 లక్షణాలివే..!

చైనాలో (China) కరోనా (Corona) మరోసారి కల్లోలం రేపుతోంది. రూపం మార్చుకుని వైల్డ్ ఫైర్‌లా వ్యాపిస్తోంది. ఒమైక్రాన్‌తో ముగిసిపోయిందనుకున్న కొవిడ్‌ మళ్లీ కొత్త రూపంలో ఉనికి చాటే ప్రయత్నం చేస్తోంది. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణం ఉన్న బీఎఫ్‌.7 (BF.7) అనే సబ్‌ వేరియంట్‌ ఇప్పుడు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒక్క మంగళవారం రోజే 3,049 బీఎఫ్‌.7 సబ్‌ వేరియంట్‌ కరోనా (BF7 Sub Variant) కేసులు చైనాలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వేల కొద్దీ కేసులు వెలుగుచూస్తుండటంతో చైనాలో వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మళ్లీ కఠిన ఆంక్షలకు చైనా తెర లేపింది. ఈ బీఎఫ్‌.7 సబ్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తులు చనిపోతుండటం కూడా చైనా భయానికి కారణంగా తెలిసింది. చైనాలో ఈ వేరియంట్ కారణంగా ఆదివారం నాడు రెండు మరణాలు, సోమవారం నాడు ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో.. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేగింది. అయితే.. చైనా మీడియా చెబుతున్న దాని కంటే మరింత ప్రమాదకర పరిస్థితులున్నాయని అంతర్జాతీయ మీడియా వాపోతోంది.

తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవలే ఈ వేరియంట్‌ గురించి హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్‌ వేరియంట్‌గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక పేర్కొంది. అయితే.. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు భారత్‌లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసులు భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. గుజరాత్‌లో రెండు కేసులు, ఒడిశాలో ఒక కేసు నమోదు కావడంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

BF.7 సబ్ వేరియంట్ గురించి..

ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతున్న ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్. దాదాపు సంవత్సరం క్రితం కొన్ని దేశాలను ఈ వేరియంట్ వణికించింది. మరీ ముఖ్యంగా.. అమెరికాలో 2021, అక్టోబర్‌లో BF.7 సబ్ వేరియంట్ కేసులు భారీగా నమోదయ్యాయి. యూకేలో నమోదైన కరోనా కేసుల్లో కూడా 7 శాతం కేసులు ఈ బీఎఫ్.7 వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం. వైద్య నిపుణుల ప్రకారం.. 500 ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ ప్రపంచ దేశాల్లోని కొందరు ప్రజలను కరోనా బారిన పడేలా చేశాయి. ఆస్ట్రేలియా, బెల్జియం దేశాల్లో కూడా ప్రస్తుతం BF.7 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వేరియంట్లతో పోల్చితే రోగ నిరోధక శక్తిని తగ్గించి మనిషిని కుంగదీసి ప్రాణాలను పొట్టనపెట్టుకునే ప్రమాదకర వేరియంట్ ఈ BF.7 సబ్ వేరియంట్ అని ప్రచారం జరుగుతోంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. BA.1, BA.2, BA.5 వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే సబ్ వేరియంట్ ఒమిక్రాన్ BF.7 అని తెలిసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియా ఈ బీఎఫ్-7 ప్రధాన లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-21T21:34:48+05:30 IST