RJD Leader : ఈ దేశంలో పరిస్థితి బాగులేదని నా పిల్లలకు చెప్పాను : ఆర్జేడీ నేత సిద్ధిఖీ

ABN , First Publish Date - 2022-12-23T14:06:43+05:30 IST

భారత దేశంలో ముస్లింలపై వ్యతిరేకత ఉందని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత అబ్దుల్ బరి సిద్ధిఖీ

RJD Leader : ఈ దేశంలో పరిస్థితి బాగులేదని నా పిల్లలకు చెప్పాను : ఆర్జేడీ నేత సిద్ధిఖీ
Abdul Bari Siddiqui

పాట్నా : భారత దేశంలో ముస్లింలపై వ్యతిరేకత ఉందని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత అబ్దుల్ బరి సిద్ధిఖీ (Abdul Bari Siddiqui) ఆరోపించారు. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేరని, విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకుని, పౌరసత్వం పొంది, అక్కడే స్థిరపడిపోవాలని తన పిల్లలకు సలహా ఇచ్చారు. గత వారం ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ, ఈ దేశంలో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఆయనకు లభిస్తున్న అన్ని రకాల సదుపాయాలను వదిలిపెట్టి, పాకిస్థాన్ వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు.

సిద్ధిఖీ ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఆయన బిహార్ మంత్రిగా కూడా పని చేశారు. ఆయన గత వారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘దేశంలోని పరిస్థితులను చెప్పడం కోసం నేను నా వ్యక్తిగత ఉదాహరణను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఓ కుమారుడు ఉన్నాడు. వాడు హార్వర్డ్‌లో చదువుతున్నాడు. ఓ కుమార్తె ఉంది. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో డిగ్రీ చేసింది. విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకోవాలని నేను వారికి చెప్పాను. సాధ్యపడితే అక్కడే పౌరసత్వం తీసుకోవాలని చెప్పాను’’ అని తెలిపారు. ‘‘వారు నా మాటలను నమ్మలేదు. నేనింకా ఇక్కడే (భారత దేశంలో) ఉన్నానని గుర్తు చేశారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ‘మీరు ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేరు’ అని చెప్పాను’’ అని పేర్కొన్నారు.

అయితే ఆయన మాటల్లో ముస్లింలు, బీజేపీ ప్రభుత్వం గురించి ప్రత్యక్ష ప్రస్తావన లేదు. కానీ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ, సిద్ధిఖీ వ్యాఖ్యలు భారత దేశానికి వ్యతిరేకమైనవని ఆరోపించారు. తాను ఇబ్బందిపడుతున్నాననే భావన ఆయనకు ఉంటే, రాజకీయ నేతగా ఆయన పొందుతున్న రకరకాల లబ్ధులను వదిలిపెట్టి, పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు. ఆయనను ఎవరూ ఆపబోరన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు సిద్ధిఖీ అత్యంత సన్నిహితుడని, ముస్లింలను బుజ్జగించి, సంతృప్తిపరచే ఆర్జేడీ సంస్కృతికి ప్రతిబింబంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.

Updated Date - 2022-12-23T14:06:48+05:30 IST