26/11 Mumbai attack : ముంబై దాడుల సూత్రధారులను శిక్షించే పని పూర్తవడం లేదు : జైశంకర్

ABN , First Publish Date - 2022-10-28T13:30:35+05:30 IST

మన కళ్ళ ముందు జరిగిన ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారులను శిక్షించే పని ఇంకా పూర్తి కాలేదని విదేశాంగ మంత్రి

26/11 Mumbai attack : ముంబై దాడుల సూత్రధారులను శిక్షించే పని పూర్తవడం లేదు : జైశంకర్
సుబ్రహ్మణ్యం జైశంకర్

ముంబై : మన కళ్ళ ముందు జరిగిన ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారులను శిక్షించే పని ఇంకా పూర్తి కాలేదని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) అన్నారు. 2008 నవంబరు 26న జరిగిన ఈ దాడుల్లో 140 మంది భారతీయులు, 23 ఇతర దేశాలకు చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సరిహద్దుల ఆవలి నుంచి వచ్చిన ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు ముంబైని దిగ్బంధనం చేశారన్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

ఈ దారుణ ఉగ్రవాద దాడుల వల్ల ముంబై నగరం దిగ్బంధనం అయిపోయిందన్నారు. రోజువారీ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న సామాన్య ముంబైవాసులు సైతం బాధితుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ దాడి కేవలం ముంబైపై మాత్రమే కాదని, అంతర్జాతీయ సమాజంపై జరిగిందని వివరించారు. ఉగ్రవాదులు హత్యాకాండకు పాల్పడటానికి ముందు ఎవరు ఏ దేశానికి చెందినవారో నిర్థరించుకున్న తర్వాతే హత్య చేశారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నిటి నిబద్ధత బహిరంగ సవాలును ఎదుర్కొందని చెప్పారు. ఈ దాడికి సూత్రధారులను చట్టం ముందు నిలిపేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఈ పని ఇప్పటికీ పూర్తి కాకుండానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూఎన్ఎస్‌సీ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈ ప్రదేశానికి రావడం చాలా ప్రత్యేకమైనదని, ముఖ్యమైనదని తెలిపారు.

జైశంకర్ ఇన్ఫార్మల్ బ్రీఫింగ్ (informal briefing)లో మాట్లాడుతూ, అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఉగ్రవాదం చాలా తీవ్రమైన ముప్పు అని హెచ్చరించారు. ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని చర్యలు నేరపూరితమైనవేనని, సమర్ధనీయం కానివని తెలిపారు. ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, విచారణ జరిపి, భారత దేశంలోని అత్యున్నత న్యాయస్థానం శిక్షించిందన్నారు. కానీ ఈ దాడుల సూత్రధారులు, కుట్రదారులను శిక్షించే పని ఇంకా పూర్తి కావడం లేదని చెప్పారు. వారు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారని, శిక్ష లేకుండా తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి వీరిలో కొందరిని ప్రకటిత ఉగ్రవాదులుగా ప్రకటించడానికి రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోలేకపోతుండటం అత్యంత విచారకరమని చెప్పారు. దీనివల్ల మన సమష్టి విశ్వసనీయత దెబ్బతింటుందని, మన సమష్టి ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు.

2008 నవంబరు 26న జరిగిన ఈ ఉగ్రవాద దాడులకు కేంద్రం ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్. యూఎన్ఎస్‌సీ కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి.

Updated Date - 2022-10-28T13:34:04+05:30 IST