ఆ తమిళ సినిమా కథను అట్లీ కాపీ కొట్టారా
ABN , First Publish Date - 2022-11-06T04:23:46+05:30 IST
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ ఇప్పుడు వివాదాన్ని ఎదుర్కొంటోంది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ ఇప్పుడు వివాదాన్ని ఎదుర్కొంటోంది. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2006లో వచ్చిన విజయకాంత్ సినిమా ‘పేరరసు’ చిత్రకథను కాపీ కొట్టి, దర్శకుడు అట్లీ ‘జవాన్’ తీస్తున్నారని నిర్మాత మాణికం నారాయణన్ తమిళ చిత్ర నిర్మాతల మండలిలో కంప్లెయింట్ ఇచ్చారు. నిర్మాతలమండలి ఈ ఫిర్యాదును పరిశీలిస్తోంది. నీతి, నిజాయతీ కలిగిన సి.బి.ఐ అధికారి కాశీ విశ్వనాథన్ కథతో ‘పేరరసు’ చిత్రాన్ని దర్శకుడు ఉదయన్ రూపొందించారు. ఇందులో హీరోగా విజయకాంత్ నటించారు. అంతర్ధానమైన ఓ జడ్జి కేసును దర్యాప్తు చేస్తుంటాడు కాశీ. ఈ ప్రక్రియలో కొంతమంది వ్యక్తులను అతను అనుమానిస్తాడు. చిత్రమేమింటే ఈ అనుమానితుల్లో ఒక్కొక్కరూ ఓ అపరిచిత వ్యక్తి చేతుల్లో హత్యకు గురవుతుంటారు. చివరకు కాశీ విశ్వనాథ్ పోలికలతో ఉన్న అతని సోదరుడే ఈ హత్యలు చేస్తుంటాడని తేలుతుంది.
‘జవాన్’ కథ ఇతమిద్ధంగా ఇదీ అని తెలియకపోయినప్పటికీ ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ‘పేరరసు’ చిత్రకథనే కాపీ కొట్టి ఈ చిత్రాన్ని తీస్తున్నారనే ఆరోపణని అట్లీ ఎదుర్కొంటున్నారు.
‘కాపీ మాస్టర్’ అనే ఆరోపణని ఎదుర్కోవడం దర్శకుడు అట్లీకి ఇది మొదటిసారి కాదు. 2019లో కె.పి.సెల్వ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ‘బిగిల్’ చిత్ర కథ తనదేననీ, అట్లీ కాపీ కొట్డాడంటూ కోర్టుకు ఎక్కారు. అయితే కోర్టు ఈ కేసును కొట్టి వేసిందనుకోండి. అది వేరే విషయం.
అట్లీ తొలి సినిమా ‘రాజారాణి’. మణిరత్నం ‘మౌన రాగం’ చిత్రానికీ, పోలికలు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. అలాగే అట్లీ మరో చిత్రం ‘మెర్సల్’ కూడా కమల్ హాసన్ ‘అపూర్వ సహోదరగళ్’ , రజనీకాంత్ ‘ముండ్రు ముగమ్’ చిత్రాలకు పోలి ఉందన్నారు.