Jaggayya: జగ్గయ్య లైఫ్‌లో వింత ఘటన.. చంకనేసుకుని నాటకాలు వేయించిన అమ్మాయి పక్కనే హీరోగా డ్యూయెట్లు..!

ABN , First Publish Date - 2022-12-31T19:32:00+05:30 IST

ప్రముఖ నటుడు జగ్గయ్య లైఫ్‌లో ఓ ఆసక్తికర ఘటన.. చంకనేసుకుని నాటకాలు వేయించిన అమ్మాయి పక్కనే హీరోగా డ్యూయెట్లు..

Jaggayya: జగ్గయ్య లైఫ్‌లో వింత ఘటన.. చంకనేసుకుని నాటకాలు వేయించిన అమ్మాయి పక్కనే హీరోగా డ్యూయెట్లు..!

తెనాలి దగ్గర ఓ గ్రామంలో ప్రదర్శించే ‘ఢిల్లీ రాజ్యపతనం’ అనే నాటకంలో మహారాజు ముందు డ్యాన్స్ చేయాల్సిన పాత్రకి ఓ చిన్నపిల్లని ఎంపిక చేసుకున్నారు కొంగర జగ్గయ్య( Kongara Jaggayya). ఆ ఊరుకి వెళ్లే దారిలో బండి చెడిపోవడంతో గత్యంతరం లేక ఆ అమ్మాయిని చంకనేసుకొని నడుచుకుంటూ వెళ్లి నాటకం వేశారు.

కట్ చేస్తే- మరికొన్నేళ్ల తర్వాత...

"నిగనిగలా తారలు తెచ్చి

నీ సిగలో ముడిచెద చెలియా

నీలి నీలి మేఘములందు

నీవు నేను ఏకమవుదాం..." అంటూ అదే పిల్లతో సినిమాలో డ్యూయెట్లు పాడవల్సి వచ్చింది జగ్గయ్యకి.

ఆ అల్లరి అమ్మాయి, గడసరి హీరోయిన్ – జమున!

2.jpg

నాటకాల రోజుల్లో....

జగ్గయ్యకి నాటకాలంటే ఎంతో ఇష్టం. 11 ఏళ్లప్పటి నుంచే నాటకాల్లో నటించడం మొదలెట్టారు. బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన 'సీత ' నాటకాన్ని హిందీలో ప్రదర్శిస్తే అందులో లవుడి పాత్ర వేశారాయన. డిగ్రీ చదువులకి గుంటూరు ఏసీ కాలేజ్ (Andhra Christian College)లో చేరాక, సహద్యాయి ఎన్టీఆర్ (NT Ramarao)తో కలిసి ఎన్నో నాటకాలు వేశారు జగ్గయ్య. అక్కడ జగ్గయ్య ఉత్తమ నటుడిగా హాట్రిక్ కొట్టారు. మహారచయిత, గొప్ప చిత్రకారుడు, సంపాదకులు అడవి బాపిరాజు(Adavi Bapiraju) దగ్గర నేర్చుకున్న పెయింటింగ్ మెళకువలు కూడా నాటక కళాభివృద్ధికే ఉపయోగించేవారు జగ్గయ్య. విజయవాడలో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున వేసిన నాటకాలకి చిత్రలేఖనపు అదనపు సొబగులు అద్దేవారు. దుగ్గిరాల హైస్కూలులో టీచర్ గా పనిచేస్తూ కూడా నాటకాలు వేసేవారు.

4.jpg

అదే స్కూలులో చదువుతున్న నిప్పాణి జనాభాయి (జమున)ని 'ఢిల్లీ రాజ్యపతనం' అనే నాటకంలో డ్యాన్స్ వేసే అమ్మాయి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. జమున మాతృభాష తెలుగు కాదు, కన్నడ. ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు తన వ్యాపార సంస్థను దుగ్గిరాలకు తరలించడంతో అక్కడికి ఆ కుటుంబం వలస రావల్సి వచ్చింది. అదే ఊరు కావడం వల్ల జమున అమ్మానాన్ననీ ఒప్పించి, జమునకి నాటకానికి కావల్సిన నాట్యం నేర్పించి ప్రదర్శనకి తీసుకు వెళ్లారు జగ్గయ్య.

తెనాలి దగ్గర ‘మండూరు’ అనే గ్రామంలో ఢిల్లీ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యపతనం ప్రధానాంశంగా రూపొందించిన 'ఢిల్లీ రాజ్య పతనం' నాటక ప్రదర్శనకి తరలివెళ్లింది ఆ నాటకం ట్రూపు.గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఉన్న ఆ నాటకబృందం తెనాలి వరకు రైలులో వెళ్లి, అక్కడ నుంచి ఎడ్లబండిలో మండూరు ప్రయాణమయ్యింది. దారిలో ఎడ్లబండి చెడిపోయింది. అందరూ దిగి నడవడం మొదలెట్టారు. కొంత దూరం మాత్రం నడిచిన ఆ గారాలపట్టి జమున, ఇక ‘నేను నడవలేన’ని ఏడుపు లంఘించుకుంది. చేసేది లేక, ఆ పిల్లని చంకనేసుకొని మోసుకుపోయారు జగ్గయ్య.

అల్లరి అమ్మాయే అందాల హీరోయిన్…

అసలు ఆ అమ్మాయికి చదువు కంటే ఆమెకు లలితకళలపైనే ఎక్కువ ఆసక్తి. ‘డిల్లీ రాజ్యపతనం’తో మొదలైన నాటకాల పిచ్చి క్రమేణా ముదిరింది. నాట్యం నేర్చుకోవడం, పాటలు పాడటం, రంగస్థల నాటకాలలో విరివిగా పాల్గోవడం ఎక్కువయ్యింది. ప్రజానాట్యమండలికి ప్రధాన కళాకారిణి అయ్యింది. జగ్గయ్య సిఫార్సుతో జమున నటించిన ఓ నాటకాన్ని చూశారు దర్శక నిర్మాత, నటుడు గరికపాటి రాజారావు. అప్పట్లో ఆయన ‘పుట్టిల్లు’ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కథలోని నాయికని జమునలో చూసిన గరికపాటి ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించారు. అలా 'పుట్టిల్లు' సినిమాలో నటించడానికి 1953లో మద్రాసు చేరుకున్నారు జమున. ఆ తర్వాత ఆరేళ్లకి గాని జగ్గయ్య సినిమాల వైపు దృష్టి పెట్టలేదు. మధ్యలో ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ గా చేశారు. అక్కడ పనిచేసిన మూడేళ్లు తెలుగువాళ్ళను పోగేసి నాటకాలేసేవారు జగ్గయ్య. ఎట్టకేలకి మహారచయిత త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వం వహించిన 'ప్రియురాలు ' సినిమా(1959)తో జగ్గయ్య సినిమారంగంలో కాలుమోపారు.

స్టిల్ ఫొటోగ్రాఫర్ పి గంగాధరరావు నిర్మాతగామారి హైద్రాబాద్ మూవీస్ పేరిట తీసిన తొలి చిత్రం ‘జల్సారాయుడు’ (1960)లో హీరోహీరోయిన్లు జగ్గయ్య, జమున మీద డ్యూయెట్టు- "అందాల సీమలో.. చందమామ కాంతిలో.. ఆడుకుందాం పాడుకుందాం ... హాయి మనదే..."

నడవలేనని మారాము చేస్తే చంకనెత్తుకున్న ఆనాటి మాష్టారు… ఈనాటి హీరోతో ఆ అమ్మాయి గారాలు పోతూ అంటోంది:

"మల్లెపొదల నీడలోన

మరపురాని హాయిలోన

మధురమైన ఊహలందు

మనసు తేలిపోవునోయి

పరవశాన మేనులు మరచి

గడుపుదాము జీవితం..."

కల్పన కంటే చిత్రమైనది జీవితం (Life is stranger than fiction)- అనే నానుడికి ఇంతకంటే ఉదాహరణ మరేముంటుంది!

(డిసెంబర్ 31- జగ్గయ్య 94వ జయంతి)

Updated Date - 2022-12-31T19:59:55+05:30 IST