Superstar Krishna: ముఖ్యమంత్రిని కూతురు పెళ్ళికి రావొద్దని చెప్పిన కృష్ణ.. ఆ సీఎం ఎవరంటే..

ABN , First Publish Date - 2022-11-16T18:05:26+05:30 IST

సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మనందరినీ వదిలి వెళ్లిపోయారు. కానీ ఆయన తెలుగు సినీ పరిశ్రమకు (TFI) చేసిన సేవలు మాత్రం ఎన్నటికీ మరువలేనివి. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ..

Superstar Krishna: ముఖ్యమంత్రిని కూతురు పెళ్ళికి రావొద్దని చెప్పిన కృష్ణ.. ఆ సీఎం ఎవరంటే..

సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మనందరినీ వదిలి వెళ్లిపోయారు. కానీ ఆయన తెలుగు సినీ పరిశ్రమకు (TFI) చేసిన సేవలు మాత్రం ఎన్నటికీ మరువలేనివి. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ లక్షల మంది హృదయాల్లో ‘జేమ్స్‌బాండ్’గా సూపర్‌స్టార్ (RIP Krishna) ఎప్పటికీ బ్రతికే ఉంటారు. ఆయన జీవితం గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అలాంటి విశేషాల్లో.. ముఖ్యమంత్రిని తన కూతురి పెళ్లికి రావొద్దని చెప్పిన సందర్భం ఒకటి. అదేంటి.. ఒక సీఎంను తన కూతురు పెళ్లికి రావొద్దని కృష్ణ అనడమేంటని ఆశ్చర్యపోతున్నారా. నమ్మశక్యం కాకపోయినా నిజం మాత్రం ఇదే. ఒక్కసారి కృష్ణ జీవితంలోకి తొంగిచూస్తే.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతిని జయదేవ్ గల్లాకి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పట్లో ఈ వివాహ వేడుక మద్రాసులో జరిగింది.

galla-jaydev.jpg

ఆ వివాహానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని కృష్ణ ఆహ్వానించారు. ఆమె తప్పకుండా వస్తానని కూడా మాటిచ్చారు. కృష్ణ, జయలలిత కాంబినేషన్‌లో 'గూఢచారి 116' సినిమా విడుదలై సూపర్‌ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కెరీర్‌లో ‘ఒక్కడు’ సినిమా అతనికి ఎలాంటి స్టార్‌డమ్ తీసుకొచ్చిందో, 'గూఢచారి 116' సినిమా కూడా కృష్ణను స్టార్ హీరో చేసింది. ఆ తరువాత ఇంకో రెండు సినిమాలు కూడా జయలలితతో కృష్ణ చేశారు. ఆ చనువు వలన వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చారు, ఆమె కూడా వస్తానని అన్నారు. అయితే అప్పట్లో జయలలితకి 'జెడ్' క్యాటగిరీ సెక్యూరిటీ ఉండేది.

krishna1.jpg

ఆమె ఎక్కడికి వెళ్లినా ముందుగా ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి సెక్యూరిటీ ఓకే చెబితే గానీ జయలలిత అక్కడికి వెళ్లేవారు కాదు. అలాగే కృష్ణ కూతురు పెళ్లిరోజు, జయలలిత సెక్యూరిటీ మనుషులు పెళ్లి మండపానికి వచ్చి కృష్ణను కలిసి మొదటి మూడు వరసల్లో కూర్చున్న అందరిని లేపాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఇంకా రాజకీయ సినిమా రంగాలకు చెందిన మంత్రులు, సెలబ్రిటీస్ అందరూ ఆ మూడు వరుసల్లో కూర్చున్నారు. వాళ్ళందరిని లేపటం కృష్ణకు ఇష్టం లేదు. అందుకని, జయలలితకి ఫోన్ చేసి.. ‘మీరు పెళ్ళికి రావొద్దు, మీ ఆశీర్వచనాలు ఉంటే చాలు’ అని చెప్పారు. జయలలిత కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని సరే అని ఒక పుష్పగుచ్ఛము ఆ నవ వధూవరులకు పంపారు. ఆ విధంగా కృష్ణ ముఖ్యమంతిని పెళ్ళికి రావొద్దని చెప్పారు.

Updated Date - 2022-11-16T18:50:29+05:30 IST