Share News

ప్రవీణ్‌ మృతిపై వేగంగా దర్యాప్తు

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:17 AM

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిపై దర్యాప్తు వేగంగా జరుగుతోందని, సీఎం చంద్రబాబు రోజూ పర్యవేక్షిస్తున్నారని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

ప్రవీణ్‌ మృతిపై వేగంగా దర్యాప్తు

  • ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీ కూడా పరిశీలిస్తున్నాం

  • అన్ని నివేదికలు వచ్చాకే మృతిపై స్పష్టతకు అవకాశం: ఏలూరు రేంజ్‌ ఐజీ

  • ప్రవీణ్‌ది ముమ్మాటికీ హత్యే

  • సీబీఐతో విచారణ జరిపించాలి

  • క్రైస్తవ సంఘాల నాయకుల డిమాండ్‌

రాజమహేంద్రవరం/పంజాగుట్ట, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిపై దర్యాప్తు వేగంగా జరుగుతోందని, సీఎం చంద్రబాబు రోజూ పర్యవేక్షిస్తున్నారని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ మాట్లాడారు. ప్రాథమికంగా పరిశీలించిన అంశాల ప్రకారం... ప్రవీణ్‌ హైదరాబాద్‌లో 24న ఉదయం 11 గంటలకు బయలుదేరారని, విజయవాడ చేరుకున్న తర్వాత సుమారు 4 గంటలు ఎక్కడ ఉన్నారనే అంశంపై లోతుగా విచారణ చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌, విజయవాడల్లో ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. కొంతమూరు టోల్‌గేటు వద్దకు రాత్రి 11.30 గంటలకు ప్రవీణ్‌ చేరుకున్నారని, 11.42 గంటలకు నయారా పెట్రోలు బంకు సమీపంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. శవపరీక్ష నివేదిక ప్రకారం చేతులు, కాళ్లపై రాపుడు, గాయాలు, ముఖంపై గాయాలు ఉన్నాయని, కాలిపై కాలిన గాయాలు ఉండటంతో పాథాలజీ విభాగానికి నమూనాలు పంపించామని పేర్కొన్నారు.


ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని, అన్నీ నివేదికలు వచ్చిన తర్వాతే ప్రవీణ్‌ మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పాస్టర్‌ ప్రవీణ్‌ది ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన హత్యేనని, సీబీఐతో విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ‘జస్టిస్‌ ఫర్‌ ప్రవీణ్‌ పగడాల జేఏసీ’ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి బాబురావు మాట్లాడుతూ కొంతకాలం నుంచి ప్రవీణ్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారని, ఆయన, కుటుంబ సభ్యుల కాల్‌ డేటాను పోలీసులు ేసకరించాలని కోరారు. విద్వేషాల వల్ల ప్రవీణ్‌లాంటి వారి మరణాలు సంభిస్తున్నాయని మేడే రాజీవ్‌ సాగర్‌ అన్నారు. ప్రవీణ్‌ కుటుంబానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేరో రూ.పది కోట్లు ఇవ్వాలని మాదిగ సంఘాల మహా కూటమి అధ్యక్షుడు పీ కిరణ్‌ మాదిగ కోరారు.

Updated Date - Mar 30 , 2025 | 02:17 AM