Jagan Meets Balakrishna: మహేశ్ ఫ్యామిలీతో బాలకృష్ణ ఉన్న సమయంలో జగన్ అక్కడికి రావడంతో..

ABN , First Publish Date - 2022-11-16T13:18:55+05:30 IST

ఆ ఇద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు. కానీ.. వ్యక్తిగతంగా ఒకరు మరొకరికి వీరాభిమాని. కానీ.. ప్రస్తుతం ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరొకరు ఆ ముఖ్యమంత్రి నిత్యం ద్వేషించే పార్టీలో..

Jagan Meets Balakrishna: మహేశ్ ఫ్యామిలీతో బాలకృష్ణ ఉన్న సమయంలో జగన్ అక్కడికి రావడంతో..

ఆ ఇద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు. కానీ.. వ్యక్తిగతంగా ఒకరు మరొకరికి వీరాభిమాని. కానీ.. ప్రస్తుతం ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరొకరు ఆ ముఖ్యమంత్రి నిత్యం ద్వేషించే పార్టీలో ఎమ్మెల్యే. అలాంటి వాళ్లిద్దరూ అనుకోకుండా తారసపడితే. అదే జరిగింది. వాళ్లిద్దరూ ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. అవును.. ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) కాగా.. మరొకరు చంద్రబాబు బావమరిది, సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna). ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు పద్మాలయ స్టూడియో (Padmalaya Studios) వేదికైంది. సీనియర్ సినీ నటులు, నటశేఖర కృష్ణ స్వర్గస్థులు (Super Star Krishna Passes Away) కావడంతో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు బాలకృష్ణ(NBK), ఏపీ సీఎం జగన్ (CM Jagan) వేరువేరు సమయాల్లో అక్కడికి చేరుకున్నారు. జగన్‌ అక్కడికి వెళ్లే సమయానికి బాలకృష్ణ, ఆయన భార్య కూడా కృష్ణ కుటుంబంతో పాటే ఉన్నారు. మహేశ్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చిన బాలయ్య ధైర్యం చెప్పి వారితో పాటే ఉన్నారు.

krishna.jpg

కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించిన అనంతరం సీఎం జగన్ మహేశ్ కుటుంబాన్ని ఓదార్చేందుకు వారి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మహేశ్ కుటుంబంతో పాటే బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ కాస్త వెనుక పక్క ఉండటంతో తొలుత జగన్ గమనించలేదు. ఆ తర్వాత బాలయ్య అక్కడ ఉన్న విషయం గ్రహించిన జగన్ నమస్కారం (Jagan Meets Balakrishna) చేశారు. బాలయ్య కూడా అంతే మర్యాదతో జగన్‌కు ప్రతి నమస్కారం చేశారు. బాలయ్య వెనుక నుంచి ముందుకొచ్చి నిల్చున్నారు. జయప్రద (Jaya Prada) కూడా జగన్‌ను గమనించలేదు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు జయప్రదను గమనించి ఆమెను పిలవడంతో ఆమె జగన్‌కు నమస్కారం చేశారు. జగన్ కూడా ఆమెకు నమస్కారం పెట్టారు.

ఇలా.. జగన్, బాలయ్య ఎదురుపడిన ఈ సందర్భం రాజకీయంగా బద్ధ శత్రువులైనప్పటికీ ఒకరినొకరు సంస్కారంతో పలకరించుకునేలా చేసింది. బాలకృష్ణ కుటుంబంతో కృష్ణకు ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన హైస్కూలు రోజుల నుంచి ఎన్టీఆర్‌కు అభిమానినని, ఆయనతో చేసిన ఆరు సినిమాల్లో తాను ఆయన తమ్ముణ్నేనని ఆయనతో ఉన్న అనుబంధాన్ని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో (Krishna Open Heart With RK) కృష్ణ గుర్తుచేసుకున్నారు కూడా.

krishna1.jpg

అయితే.. అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు సహజమే కదా. ఎన్టీఆర్, కృష్ణ (NTR Krishna) మధ్య కూడా అలాంటి విభేదాలే వచ్చాయి. ‘సీతారామరాజు’ (Alluri Sitarama Raju Movie) సినిమా తాను తీస్తానంటే ఎన్టీఆర్ వద్దన్నారని, పాట, ఫైటు ఏమీ లేకుండా, కాషాయ వస్త్రాలు కట్టుకున్న హీరో సినిమా ఆడదనేది ఎన్టీఆర్ ఉద్దేశమని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కృష్ణ చెప్పారు. ‘మీరు తీస్తానంటే నేను ఆగిపోతాను’ అన్నానని, అది ఆయనకు నచ్చలేదని ఎన్టీఆర్‌తో విభేదాల గురించి ఆ సందర్భంలో సూపర్‌స్టార్ గుర్తుచేశారు. దాంతో ఎన్టీఆర్ పదేళ్ల పాటు మాట్లాడటం మానేశారని చెప్పారు. కొన్నేళ్ల తర్వాత ఆయన ఒక స్టూడియోలో ఎదురుపడినప్పుడు తనను ఆపి ‘బ్రదర్‌, మీ సినిమా నేను చూడాలి’ అన్నారట. అప్పటికప్పుడు తెచ్చి చూపిస్తే ‘ఇంతకన్నా ఎవరూ ఈ సినిమాను తియ్యలేరు’ అని ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా చెప్పారని కృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో వివరించారు. ఎన్టీఆర్ కుటుంబంతో కృష్ణకు ఉన్న అనుబంధం అలాంటిది. ఎన్టీఆర్ తదనంతరం బాలకృష్ణ కూడా కృష్ణ కుటుంబంతో (Balakrishna Krishna Family) సఖ్యంగానే ఉన్నారు. మహేశ్‌ను ఇటీవల ఒక ఓటీటీ షోలో బాలయ్య ప్రశంసలతో ఆకాశానికెత్తేసిన సంగతి కూడా తెలిసిందే.

jayaprada.jpg

ఇక.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో కూడా కృష్ణ కుటుంబానికి (Jagan Krishna Family) స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కృష్ణ (Krishna YSR) ఎంతో స్నేహంగా ఉండేవారు. వైఎస్ కుటుంబంలోని మహిళల్లో ఎక్కువ మంది సూపర్ స్టార్ కృష్ణ అభిమానులే కావడం విశేషం. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం చేశాక జగన్‌తో కూడా కృష్ణ, విజయనిర్మల స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించారు. ఒకానొక సందర్భంలో వైసీపీలో కృష్ణ చేరతారనే ప్రచారం కూడా జరిగింది. వైఎస్ కుటుంబమంటే అభిమానం ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆసక్తి లేదని ఆ సందర్భంలో కృష్ణ స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన బృందంలో కృష్ణ తనయుడు మహేశ్ బాబు కూడా ఉన్నారు. ఇలా కృష్ణ కుటుంబంతో అనుబంధం కలిగిన నందమూరి బాలకృష్ణ, వైఎస్ జగన్ తారసపడి ఒకరినొకరు పలకరించుకోవడం అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Updated Date - 2022-11-16T13:32:09+05:30 IST