Sharat Kamal : శరత్‌ కమల్‌కు ఖేల్‌రత్న

ABN , First Publish Date - 2022-11-06T05:46:11+05:30 IST

టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం శరత్‌ కమల్‌కు ప్రతిష్ఠాత్మక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు లభించనుంది. ఈమేరకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏఎం

Sharat Kamal : శరత్‌ కమల్‌కు ఖేల్‌రత్న

అర్జునకు నిఖత్‌ జరీన్‌, శ్రీజ సిఫారసు చేసిన ఎంపిక కమిటీ

న్యూఢిల్లీ: టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం శరత్‌ కమల్‌కు ప్రతిష్ఠాత్మక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు లభించనుంది. ఈమేరకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్‌ ఆధ్వర్యంలోని 12 మంది సభ్యుల క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ఈ తెలుగు పాడ్లర్‌ పేరును క్రీడా శాఖకు సిఫారసు చేసింది. అలాగే ఇద్దరు తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. ఈ ఏడాది క్రీడా అవార్డులకు సంబంధించి తుది జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖకు కమిటీ అందజేసింది. 40 ఏళ్ల శరత్‌ బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం అతడు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. హాకీ స్టార్లు హర్మన్‌ప్రీత్‌, ఆకాశ్‌దీ్‌ప, మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ సవిత, స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పూనియా, సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ సహా మొత్తం 42 మంది మేటి అథ్లెట్లు ఈసారి ఖేల్‌రత్నకు దరఖాస్తు చేసుకున్నా.. కమిటీ మాత్రం ఒక్క కమల్‌ పేరునే సిఫారసు చేయడం విశేషం. ఇక అర్జున అవార్డులకు మొత్తం 25 మంది క్రీడాకారులను ఎంపిక చేసింది. ఇందులో మహిళల వరల్డ్‌ చాంపియన్‌, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఉంది. అలాగే దేశ మహిళా టీటీలో సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాదీ ఆకుల శ్రీజ కూడా అర్జున జాబితాలో చోటు దక్కించుకుంది. 24 ఏళ్ల శ్రీజ ప్రస్తుత జాతీయ టీటీ సింగిల్స్‌, డబుల్స్‌ చాంపియన్‌. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమె శరత్‌తో కలిసి మిక్స్‌డ్‌లో పసిడి పతకం నెగ్గింది .

అర్జున అవార్డుల జాబితా: నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ (టీటీ), లక్ష్యసేన్‌, ప్రణయ్‌ (బ్యాడ్మింటన్‌), అమిత్‌ పంగల్‌ (బాక్సింగ్‌), సీమా పూనియా, ఎల్డోస్‌ పాల్‌, అవినాశ్‌ సబ్లే (అథ్లెటిక్స్‌), ప్రజ్ఞానంద, భక్తి కులకర్ణి (చెస్‌), దీప్‌ గ్రేస్‌ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్‌ మోనీ సైకియా (లాన్‌బౌల్స్‌), సాగర్‌ (మల్లఖంబ్‌), వలారివన్‌, ఓం ప్రకాశ్‌ (షూటింగ్‌), వికాస్‌ ఠాకూర్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌), అన్షూ మాలిక్‌, సరితా మోర్‌ (రెజ్లింగ్‌), ప్రవీణ్‌ (వుషు), మాన్సీ జోషి, తరుణ్‌ థిల్లాన్‌ (పారా బ్యాడ్మింటన్‌), స్వప్నిల్‌ పాటిల్‌ (పారా స్విమ్మింగ్‌), జెర్లిన్‌ అనికా (బధిర బ్యాడ్మింటన్‌).

Updated Date - 2022-11-06T05:46:12+05:30 IST