KCR: కేసీఆర్‌కు షాక్‌!

ABN , First Publish Date - 2022-12-27T03:16:02+05:30 IST

‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

 KCR: కేసీఆర్‌కు షాక్‌!

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు

సిట్‌ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ జీవో కొట్టివేత

ఇప్పటివరకు చేసిన దర్యాప్తు సైతం రద్దు

బీజేపీ పిటిషన్‌కు విచారణార్హత లేదు

నిందితుల పిటిషన్లను అనుమతించిన హైకోర్టు

ఆర్డర్‌ కాపీ వచ్చే వరకు తీర్పు అమలు నిలిపివేత

డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌కు సిద్ధమౌతున్న సర్కారు

సీఎంకు ఆధారాలెవరిచ్చారో సర్కారు చెప్పలేదు

దాంతో దర్యాప్తు పారదర్శకతపై అనుమానాలు

నిందితుల భయాలు సహేతుకమేనన్న హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తునకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం కావడంతో వివక్ష లేని, పారదర్శక దర్యాప్తు జరగదేమోనన్న అనుమానం నిందితుల్లో ఏర్పడింది. పారదర్శక దర్యాప్తు నిందితులకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కు. దర్యాప్తు మొత్తం దురుద్దేశపూరితంగా ఉందని నింది తులు ఆందోళన చెందడమూ చట్టబద్ధమే. పోలీసుల దర్యాప్తు, న్యాయస్థానంలో విచారణ రెండూ పారదర్శకంగా ఉండాలి. కేసు వివరాలను చాటింపు వేసినట్లు చెప్పడం నిందితుల హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది.

- హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీనియర్‌ ఐపీఎస్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో(నంబరు 63)ను కొట్టేసింది. ఇప్పటివరకు సిట్‌ చేసిన దర్యాప్తును, సిట్‌ ఏర్పాటుకు ముందు దర్యాప్తు అధికారి(ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌) చేసిన దర్యాప్తును కొట్టేసింది. ఆ దర్యాప్తు చెల్లదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి, ప్రతిపాదిత నిందితులు తుషార్‌, భూసారపు శ్రీనివాస్‌ తదితరులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లపై సోమవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది.

రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌కు మాత్రం విచారణార్హత లేదంటూ కొట్టేసింది. నిందితులు, ప్రతిపాదిత నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లను అనుమతించింది. మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆధారాలు, మెటీరియల్‌ను ఎవరు అందించారనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లలో సైతం సీఎం కేసీఆర్‌కు ఎవరు ఆధారాలు అందించారు? అనే అంశంపై స్పష్టత లేదని హైకోర్టు పేర్కొంది. అలాగే, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పోలీసులు చేసిన ట్రాప్‌ వీడియోలను ముఖ్యమంత్రికి ఎవరు అందించారనే దానిపై కూడా ఎలాంటి వివరాలను ప్రభుత్వం పేర్కొనలేదని తెలిపింది.

దర్యాప్తునకు సంబంధించిన ఆధారాలు, మెటీరియల్‌ ఇతర అథారిటీలకు అందజేయకుండా ఉండాల్సిందని.. అలా అందజేయడం వల్ల దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదేమో అన్న అనుమానాలు ఏర్పడ్డాయని పేర్కొంది. మొత్తం ఆధారాలు మీడియాకు చేరవేయడాన్ని సైతం ధర్మాసనం తప్పుబట్టింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం తీవ్రమైన అంశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉండగానే కీలక ఆధారాలు బహిర్గతం కావడాన్ని మాత్రం తప్పుబట్టింది. దర్యాప్తునకు సంబంధించిన ఆధారాలు బయటకు రావడం వల్ల పారదర్శక, వివక్ష లేని దర్యాప్తు జరగదేమోనన్న అనుమానం నిందితుల్లో ఏర్పడిందని చెప్పింది. వివక్ష ఉందా? లేదా? అనే విషయం పక్కన పెడితే, దర్యాప్తు మొత్తం దురుద్దేశంతో కూడుకుని ఉన్నదని నిందితుల్లో చట్టబద్ధమైన ఆందోళన నెలకొందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని నిందితుల కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని ఽచెప్పింది. వారి చట్టబద్ధమైన ప్రయోజనాలకు నష్టం కలుగుతుందా? అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పారదర్శకమైన ట్రయల్‌ జరగడంతోపాటు దర్యాప్తు కూడా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పారదర్శక దర్యాప్తు అనేది కూడా ఆర్టికల్‌ 20, 21 ప్రకారం నిందితులకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది. కేసుకు సంబంధించిన ఘటనలను ప్రజలందరి ముందు చాటింపు వేయడం నిందితుల హక్కులకు భంగం కలిగిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పారదర్శక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు సిట్‌ ఏర్పాటు జీవోను కొట్టేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ఆదేశాల కాపీ అందజేవరకు అమలు నిలిపివేత

జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఽఏకసభ్య ధర్మాసనం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ఈ ఆదేశాల అధికారిక కాపీ ప్రభుత్వానికి అందేవరకు అదేశాల అమలును నిలిపేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఆదేశాల కాపీ జారీ చేసే వరకు వాటి అమలును నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఎదుట సవాల్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

తొలిరోజు నుంచే పిటిషన్‌ల వెల్లువ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నమోదైనప్పటి నుంచి ట్రయల్‌ కోర్టు అయిన ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్‌లు వెల్లువెత్తాయి. మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైన మర్నాడే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని తొలుత రాష్ట్ర బీజేపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తర్వాత మొదటి ముగ్గురు నిందితులు, ప్రతిపాదిత నిందితులు కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లు దాఖలు చేశారు. మునుగోడు ఎన్నికలయ్యే వరకు సిట్‌ దర్యాప్తును వాయిదా వేసిన జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. తర్వాత స్టే ఉత్తర్వులను ఎత్తేసింది. స్టేను ఎత్తేయడంపై బీజేపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలని.. సిట్‌ స్వతంత్రంగా వ్యవహరించాలని డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. మరోవైపు కేసు నమోదైన మరుసటి రోజు ముగ్గురు నిందితులు రామచంద్రభారతి. నందకుమార్‌, సింహయాజీలకు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా నిందితులు..

పోలీస్‌ కమిషనర్‌ ఎదుట లొంగిపోవాలని జస్టిస్‌ సుమలత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని అటు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును, నిందితులకు రిమాండ్‌ విధిస్తూ జస్టిస్‌ సుమలత ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. సిట్‌ స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని, అదే సమయంలో నిందితులకు బెయిల్‌ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో నిందితులకు జస్టిస్‌ సుమలత ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. తమకు ఇచ్చిన 41ఏ నోటీసులను కొట్టేయాలని ప్రతిపాదిత నిందితులు బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌లు దాఖలు చేశారు. జస్టిస్‌ కే సురేందర్‌ ఏకసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిపాదిత నిందితులు బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గు, భూసారపు శ్రీనివా్‌సలను నిందితులుగా చేర్చాలని సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ ఆదేశాలపై సిట్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ డీ నాగార్జున ఏకసభ్య ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తాజాగా కేసును సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన కేసుల్లో జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి తీర్పు ఇచ్చారు. పలు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లు సైతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - 2022-12-27T05:00:41+05:30 IST