జిల్లాకు విలువిద్య శిక్షణ కేంద్రం
ABN , First Publish Date - 2022-12-10T01:49:33+05:30 IST
జిల్లాకు విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ జిల్లా క్రీడా శాఖకు ‘శాట్స్’ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అందజేశారు.
కేంద్రం నిధులతో ఏర్పాటు
అకాడమీ పోయి శిక్షణ కేంద్రం మంజూరు
కేంద్రం ఉత్తర్వుతో క్రీడాభిమానుల హర్షం
సుభాష్‌నగర్, డిసెంబరు 9: జిల్లాకు విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ జిల్లా క్రీడా శాఖకు ‘శాట్స్’ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17జిల్లాలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాలను కేంద్రం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఖమ్మం జిల్లాకు తరలిన విలువిద్య అకాడమీ
జిల్లాకు గతంలో అకాడమీలు ఉండేవి. 1997నుంచి 2005 వరకు జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో విలువిద్య శిక్షణ ఆకాడమీ కొనసాగింది. నాణ్యమైన కోచ్‌ల చేత విలువిద్య అకాడమీ నిర్వహించడంతో విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడా కారులు రాణించారు. అయితే 2005తర్వాత విలువిద్య అకాడమీని ఖమ్మం జిల్లాకు తరలించడంతో విలువిద్య క్రీడా మూలనపడిపోయింది. ప్రస్తుతం అకాడ మీ స్థానంలో శిక్షణ కేంద్రం రావడంతో పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శాట్స్, డీఎస్‌ఏకు బాధ్యతలు..
ఖేలో ఇండియా కేంద్రాన్ని భారత క్రీడా సంస్థ సాయి ఏర్పాటు చేసినప్పటికీ బాధ్యతలను మాత్రం జిల్లా క్రీడాప్రాదికారిక సంస్థ, రాష్ట్ర క్రీడా ప్రాదికారిక సంస్థకు అప్పగించనున్నారు. అకాడమీ నిర్వహించే వారు అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిఽథ్యం వహించిన వారిని శిక్షకులుగా నియమించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది. సంవత్సరానికి 5లక్షల రూపాయల నిధులను విడుదల చేసి అందులోనే శిక్షకులకు క్రీడా పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే శిక్షకులు సైతం తమ దరఖాస్తులను క్రీడ ప్రాదికార శాఖకు అందచేసినట్లు తెలిసింది. ఇందులో అత్యుత్తమ శిక్షకులను నియమించనున్నారు.
రాజారాం స్టేడియంలోని శిక్షణ కేంద్రం
.జిల్లా కేంద్రంలోని నాగారంలోని రాజారాం స్టేడియంలోనే విలువిద్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గతంలో సైతం విలువిద్య అకాడమీ నాగారం స్టేడియంలో ఉండడంతో ప్రస్తుతం నాగారం స్డేడియాన్ని విలువిద్య శిక్షణ కేంద్రంగా మార్చనున్నారు.
జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు
జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ క్రీడకారులకు సరైన శిక్షణ లేకపోవడంతో జిల్లా క్రీడా కారులు రాష్ట్ర, జాతీయ స్థాయికే పరిమితమవుతున్నారు. జిల్లాలో అధికారికంగా ఒక్క క్రీడకు కూడా కోచ్‌ను నియమించలేదు. ప్రైవేటు కోచ్‌ల పర్యవేక్షణలోనే జిల్లాలో క్రీడా కారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. గతంలో శిక్షణ తీసుకున్న క్రీడాకారులు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు ఖ్యాతి తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా సరైన కోచ్‌లు లేకపోవడంతో పాటు క్రీడాలకు నిధులు కరువడంతో క్రీడల్లో రాణించడం క్రీడాకారులకు భారంగా మారింది.
శిక్షణ కేంద్రం కేటాయించడం హర్షనీయం
ఫ సంజీవరెడ్డి, ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు
జిల్లాకు విలువిద్య శిక్షణ కేంద్రం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం హర్షనీయం. దీంతో పాటు నిధులను కూడా ఇవ్వడం సంతోషం. చాల రోజులుగా జిల్లాలో శిక్షకులు కరువయ్యారు. ప్రతి క్రీడకూ శిక్షకులను నియమించాలి.
నియమ నిబంధనలు రాలేదు..
ఫ ముత్తెన్న, జిల్లా క్రీడల యువజన శాఖాధికారి
జిల్లాకు ఖేలో ఇండియా ద్వారా విలువిద్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు శాట్స్ ద్వారా ఉత్తర్వులు అందాయి. నియమనిబంధనలు మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు. త్వరలో విలువిద్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాము.