Somuveerraju: మేము వైసీపీతో ఎప్పుడూ లేము.. ఉండం కూడా
ABN , First Publish Date - 2023-06-14T13:50:43+05:30 IST
జగన్ ప్రభుత్వ విధానాలకు తాము వ్యతిరేకిస్తున్నామని... ఏనాడు జగన్‌ను తాము సమర్ధించలేదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... యువ మోర్చా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా మోసాలు చేసిందో మోటారు ర్యాలీలు, సభల ద్వారా వివరించామన్నారు.
విజయవాడ: జగన్ ప్రభుత్వ (Jagan Government)విధానాలకు తాము వ్యతిరేకిస్తున్నామని... ఏనాడు జగన్‌ను తాము సమర్ధించలేదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (BJP Leader Somuveerraju) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... యువ మోర్చా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా మోసాలు చేసిందో మోటారు ర్యాలీలు, సభల ద్వారా వివరించామన్నారు. గతంలో నడ్డాతో పాటు కేంద్రమంత్రుల ఏపీ పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. మతతత్వ వైఖరితో ఉన్న పార్టీ వైసీపీ అని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళుతూ ఉంటామన్నారు. బీజేపీ ఎప్పుడు మీతో ఉందో ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan Reddy) చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌కు అలా మాట్లాడే హక్కు లేదన్నారు. పవన్ (Janasena Chief Pawan Kalyan) మద్దతు తెలపరని ముఖ్యమంత్రి అంటున్నారని... ఎందుకు మద్దతు తెలపాలని ప్రశ్నించారు. పవన్ బీజేపీతో (BJP) ఉన్నారని.. పవన్‌పై వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్యమంత్రికి ఘాటుగా చెప్తున్నామన్నారు. ఏపీలో బిజెపిని పలచన చేయడానికి జగన్ వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మోదీ (PM Narender Modi) వద్దకు వెళ్ళి డబ్బులు తీసుకుంటూ మోదీ పేరునే చెప్పడం లేదన్నారు. జగన్, పేర్ని నాని పొంతన లేకుండా తలో మాట మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గుర్తొస్తొందా అని ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి చేస్తున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రుల అవినీతిపై పోరాడుతుంది తమ పార్టీనే అని అన్నారు. కేంద్రం మద్దతు తెలుపకుండా ఏపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి, మంత్రుల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని విమర్శించారు. తాము వైసీపీతో ఎప్పుడూ లేమని.. ఉండం కూడా అని స్పష్టం చేశారు. వైసీపీకి సహాయం చేస్తామని బీజేపీ, జనసేన ఎప్పుడూ చెప్పలేదన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో ఏపీకి ఏం చేశామో బ్రోచర్ విడుదల చేశామన్నారు. ఈ నెల 20 నుంచి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తామన్నారు. ‘‘ఇసుక, ఎర్రచందనం ఎలా కొట్టేయాలని మీరు చూస్తున్నారు. మీరు నడిపే రాజకీయాలు కాకుండా మేము నడిపే అవినీతి లేని పాలనతో అధికారంలోకి వస్తాం.. బొత్స తెలుసుకోవాలి’’ అంటూ సోమువీర్రాజు హితవుపలికారు.