LokeshPadayatra: లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్
ABN , First Publish Date - 2023-03-21T20:48:09+05:30 IST
టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)కు ఉగాది సందర్భంగా మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు.
కదిరి: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)కు ఉగాది సందర్భంగా మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ మూడు రోజులు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ మండలం వనుకువారిపల్లి విడిది కేంద్రంలోనే లోకేశ్ బస చేస్తారు. పండుగ కూడా విడిది కేంద్రంలోనే జరుపుకుంటారు. తిరిగి ఈనెల 25న గొనుకువారిపల్లి నుంచి లోకేశ్ (NaraLokesh) పాదయాత్ర ప్రారంభిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక రోజు, నందమూరి తారకరత్న (Taraka Ratna) మృతితో రెండు రోజులు వరుసగా మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. తారకరత్న అంత్యక్రియల్లో లోకేశ్ పాల్గొని.. శ్రీకాళహస్తి నుంచి పాదయాత్రను కొనసాగించారు. ఇటీవల ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ ఈనెల 12, 13 తేదీల్లో తాత్కాలికంగా యువగళం పాదయాత్రకు విరామిచ్చారు.
మరోవైపు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao), మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరు హాజరయ్యారు. లోకేశ్‌తో కలిసి శ్రీసత్యసాయి జిల్లాలో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో నారా లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు యువకులు, ప్రజలు పోటీపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. శోభకృతనామ సంవత్సరం అందరికీ శుభాలు కలగచేయాలని, తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరాలని, అందరికీ సుఖసంతోషాలు, ఆయురార్యోగాలు కలగాలని కోరుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని యువగళం పాదయాత్ర క్యాంపు నుంచి మంగళవారం ఆయన తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.