భౌ.. భౌ..!

ABN , First Publish Date - 2023-02-24T00:55:59+05:30 IST

రోడ్డు దాటుతున్న బాలుడిని కుక్కలు చుట్టుముట్టాయి. పగబట్టినట్లుగా కొరికి చంపేశాయి. ఈ అమానవీయ ఘటన హైదరాబాదులోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా జిల్లాలోనూ కుక్కలు గుంపులుగా వెంటపడుతున్నాయి.

భౌ.. భౌ..!
చిత్తూరు నగరం మిట్టూరులో గుంపుగా ఉన్న కుక్కలు

జిల్లాలో గ్రామ సింహాల వీరంగం

గాయపడుతున్న ప్రజలు, మూగజీవాలు

పట్టించుకోని అధికారులు

రోడ్డు దాటుతున్న బాలుడిని కుక్కలు చుట్టుముట్టాయి. పగబట్టినట్లుగా కొరికి చంపేశాయి. ఈ అమానవీయ ఘటన హైదరాబాదులోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా జిల్లాలోనూ కుక్కలు గుంపులుగా వెంటపడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదులాంటి విషాదం మన ఊర్లో.. మన వీధిలో.. మన పిల్లలకు జరగకుండా అధికారులు స్పందించాలి. - చిత్తూరు

ఫ నెల కిందట చిత్తూరు నగరం శివాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నారు. ఆయనపై కుక్కలు దాడిచేసి గాయపరిచాయి.

ఫ వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి చెందాయి. రూ.2 లక్షల వరకు ఆ రైతు నష్టపోయారు.

జిల్లాలో వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. రోడ్లలో స్వైరవిహారం చేస్తూ ఒంటరిగా వెళ్లేవారు, ద్విచక్ర వాహనదారులను తరుముతున్నాయి. భయంతో వీటి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. మరికొందరు కుక్కకాటుకు గురవుతున్నారు. ఒక్క చిత్తూరు కార్పొరేషన్‌లోనే 50 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌లో 100 కుక్కల వరకు ఉంటాయని అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన నగరంలోనే 5వేల కుక్కల వరకు ఉంటాయి. ప్రధానంగా ఇరువారం, జానకారపల్లె, మిట్టూరు, తోటపాళ్యం, మంగసముద్రం, ఆర్టీసీ బస్టాండ్‌, వెంగళరావుకాలనీ, వీరభద్రకాలనీ, కొంగారెడ్డిపల్లె, ఎస్టేట్‌, సాంబయ్యకండ్రిగ, గిరింపేట, శివాజీనగర్‌, రామ్‌నగర్‌కాలనీ, గంగనపల్లె తదితర ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. పనులకు వెళ్లిన రాత్రివేళ ఇంటికి రావాలన్నా, తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి. రాత్రివేళల్లో వీధిలైట్ల కింద, కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లవద్ద గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. అటుగా వచ్చేవారిని చూసి అరుస్తూ వెంటపడుతున్నాయి. ఇక, నగరి, పుంగనూరు, కుప్పం, పలమనేరు, పుత్తూరు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ పట్టణాలతో పాటు 33 మండలాలతో కలిపి 15వేల వీధి కుక్కలు ఉంటాయని అధికారులు అంటున్నారు. చికెన్‌, మటన్‌షాపుల వద్ద వ్యర్థాలను తింటూ అక్కడే పడుంటాయి. రోడ్లపై వాహనాల్లో వెళ్ళేవారిని వెంబడిస్తున్నాయి. వేగంగా ద్విచక్రవాహనాల్లో వెళ్ళేవారు కుక్కల అరుపులకు భయపడి ప్రమాదాలకు గురైన సంఘటనలూ లేకపోలేదు. ఇక, గ్రామాల్లో కుక్కకాటుకు గొర్రెలు, మేకలు, కోళ్లూ బలవుతున్నాయి.

అనర్థం జరిగితే కానీ పట్టించుకోరా?

చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ వెటర్నరీ డాక్టర్‌ ఉండాలి. వీధి కుక్కలకు సిజేరియన్లు చేయాలి. జిల్లాలో ఏ మున్సిపాలిటీలోనూ వెటర్నరీ డాక్టర్లు లేరు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు తిరుపతి వెటర్నరీ ఆస్పత్రి నుంచి వ్యాన్‌ను రప్పించి కుక్కలను పట్టి సిజేరియన్‌ చేసేవారు. ఏడాదికిగాపై ఒక్క కుక్కకు కూడా సిజేరియన్‌ చేయలేదని సమాచారం. నగరపాలక సంస్థలో వీధికుక్కల సంరక్షణకు సాధారణ నిధుల కింద బడ్జెట్‌ కేటాయించారు. మరి ఆ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదు. ఏదేని అనర్థం జరిగితే కానీ పట్టించుకోరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అందుబాటులో వ్యాక్సిన్లు

జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ, యూహెచ్‌సీల్లోనూ కుక్కకాటుకు మందులు ఉన్నాయి. గతంలో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ (ఏఆర్‌వీ) ఉండేది కాదు. ప్రస్తుతం అవి కూడా అందుబాటులో ఉన్నాయి. కుక్క కరిచినా.. గోళ్లతో గీకినట్లు అనిపించినా డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. అవసరమైతే వ్యాక్సిన్‌ వేసుకోవాలి.

- ప్రకాశం, డీఎంహెచ్‌వో

ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటున్నాం

గ్రామీణ ప్రాంతాల్లోని కుక్కలకు పంచాయతీ అధికారులు, వెటర్నరీ డాక్టర్లను సమన్వయం చేసుకుని సిజేరియన్లు చేయబోతున్నాం. జిల్లాలో ఎక్కడైనా కుక్కకాటుకు గురైనట్లు ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు చేపడుతున్నాం.

- లక్ష్మి, డీపీవో

Updated Date - 2023-02-24T00:56:03+05:30 IST