జల్లికట్టు.. పట్టీ పట్టు
ABN , First Publish Date - 2023-03-27T00:34:36+05:30 IST
వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. గిత్తలను నిలువరించే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.
వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. గిత్తలను నిలువరించే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. కోడెగిత్తల కొమ్ములకు వివిధ దేవుళ్లు, రాజకీయ ప్రముఖులు, సినీ హీరోలు, గిత్తల యజమానుల ఫొటోలతో కూడిన పట్టీలను కట్టి అల్లిలోకి వదిలారు. కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు పట్టీలు దక్కించుకున్నారు. చాలా వరకు గిత్తలు చేతికి చిక్కకుండా పరుగులు తీశాయి. గిత్తల కింద పడ్డ పలువురు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. చంద్రగిరి సమీపంలోని పనబాకంకు చెందిన ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలు తెలియడం లేదు. జల్లికట్టు వీక్షణకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో గ్రామంలో జనసందడి నెలకొంది.
- వెదురుకుప్పం
జనసంద్రంగా మారిన గాండ్లపల్లె
జల్లికట్టు చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలతో వి.కోట మండలం గాండ్లపల్లె ఆదివారం జనసంద్రంగా మారింది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పశువులను తీసుకొచ్చారు. గాండ్లపల్లె గంగమాంబ ఆలయం నుంచి బరి ఏర్పాటు చేసి వీధికి ఎగువ వైపునకు రెండువైపులా బారికేడ్లు కట్టి పశువులను వదిలారు. పరుగులు పెడుతున్న వాటిని నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఈ పోటీలను తిలకించేందుకు పొరుగు మండలాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో గాండ్లపల్లె మిద్దెలు, మేడలు ఎటు చూసినా జనం భారులు తీరారు. తక్కువ సమయంలో బరిలోకి చేరుకున్న వాటిని విజేతలుగా ప్రకటించి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పశువులను నిలువరించే క్రమంలో కొందరు గాయపడ్డారు.
- వి.కోట