CI Anju Yadav: సీఐ అంజు యాదవ్ ఎవరి ఫ్యానో తెలిసిపోయింది..!

ABN , First Publish Date - 2023-07-14T16:21:00+05:30 IST

అలిపిరి వద్ద 2003 అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై నక్సలైట్లు క్లైమోర్‌ మైన్స్‌ పేల్చిన ఘటనలో సీఎం కారుపైకి ఎక్కి సూపర్‌ కాప్‌గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారి అంజూ యాదవ్‌ ఇప్పుడు వరుస వివాదాలతో సొంత శాఖ ప్రతిష్ట మసకబారి పోయేందుకు కారకులవుతున్నారు.

CI Anju Yadav: సీఐ అంజు యాదవ్ ఎవరి ఫ్యానో తెలిసిపోయింది..!

తిరుపతి (ఆంధ్రజ్యోతి): అలిపిరి వద్ద 2003 అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై నక్సలైట్లు క్లైమోర్‌ మైన్స్‌ పేల్చిన ఘటనలో సీఎం కారుపైకి ఎక్కి సూపర్‌ కాప్‌గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారి అంజూ యాదవ్‌ ఇప్పుడు వరుస వివాదాలతో సొంత శాఖ ప్రతిష్ట మసకబారి పోయేందుకు కారకులవుతున్నారు.


ప్రధానంగా విపక్షాలపైనే గురి!

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏర్పేడు మండలంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా అధికారులు వైసీపీ నేతల ఒత్తిడికి లోనై టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్‌ పార్టీ శ్రేణులతో కలసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రేణిగుంట నుంచీ బందోబస్తు నిమిత్తమై వచ్చిన అంజూయాదవ్‌ ఆ సందర్భంగా సుధీర్‌ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. శ్రీకాళహస్తిలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన ప్రదర్శించేందుకు వెళ్లిన సందర్భంలోనూ, అలాగే అనాసంపల్లిలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంలోనూ టీడీపీ నాయకులపై ఆమె దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సీఎం జగన్‌ దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ నేతలు ప్రయత్నించగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు కోబాకు లక్ష్మణ్‌పై సీఐ చేయి చేసుకున్నారు. ఆ తరువాత పట్టణంలో నిరసన తెలిపేందుకు వెళ్లిన తెలుగు మహిళా నాయకురాలు చక్రాల ఉషపై దురుసుతనం ప్రదర్శించారు. తాజాగా జనసేన నాయకుడు కొట్టే సాయిపై బుధవారం బహిరంగంగా చేయి చేసుకున్నారు.

ఉపాధ్యాయుల పట్లా అదే తీరు

తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల నేతలు ఛలో విజయవాడ కార్యక్రమం కోసం రేణిగుంట నుంచీ వెళుతుండగా సీఐ అంజూ యాదవ్‌ వారి పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఆమె తీరును ప్రశ్నించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్‌రెడ్డితో ఆమె వాగ్వాదానికి దిగి వివాదాన్ని మరింత పెంచారనే ఆరోపణలున్నాయి. రేణిగుంట మండలంలో ఒక వ్యక్తి మరణం అనుమానాలకు దారి తీయగా రమేష్‌ అనే విలేకరి వార్త రాయడం కోసం డీఎస్పీని వివరణ కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ అంజూ యాదవ్‌ అతడికి ఫోన్‌ చేసి గొడవ చేసిందని, మరుసటి రోజు వార్త ప్రచురితం కావడంతో విలేకరితో పాటు కుటుంబసభ్యుల్ని కూడా స్టేషన్‌కు తీసుకెళ్ళి దాడిచేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దళిత సంఘాలు కలెక్టర్‌, ఎస్పీ మొదలుకుని గవర్నర్‌ వరకూ ఫిర్యాదులు చేశారు. ఈ ఘటనలో కలెక్టర్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కూడా సీఐపై కేసు నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోలేదని సమాచారం.

రేణిగుంటలో ఓ భవన యజమాని రోడ్డుపై నిర్మాణసామగ్రి వుంచారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై సీఐ అంజూ యాదవ్‌ భవన యజమానిని స్టేషన్‌కు పిలిపించి దౌర్జన్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి వెళ్ళి ప్రశ్నించగా ఆయన పట్ల కూడా అంజూయాదవ్‌ దూకుడుగా వ్యవహరించారు. దీనిపై వైసీపీ శ్రేణులతో కలిసి ఎంపీపీ ఆందోళనకు దిగగా అదే సమయంలో అక్కడకు వచ్చిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి సీఐని ప్రశ్నించారు. దీంతో ఆమె పట్ల కూడా సీఐ దురుసుగా వ్యవహరించారని వైసీపీ శ్రేణులు అందోళనకు దిగాయి.శ్రీకాళహస్తిలో హోటల్‌ నడుపుకుంటున్న మహిళ ధనలక్ష్మిని సీఐ అంజూ యాదవ్‌ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణతో ఆమెను హోటల్‌ వద్దే చితకబాది వాహనంలో స్టేషన్‌కు లాక్కెళ్ళిన దృశ్యాలతో కూడిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.తర్వాత సీఐపై హోటల్‌ నిర్వాహకులు ప్రైవేటు కేసు దాఖలు చేశారు.ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణంగానే కిందిస్థాయి అధికారులు తామేం చేసినా ఏం కాదన్న ధిక్కార ధోరణికి అలవాటు పడేలా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

శ్రీకాళహస్తిలోనే తేల్చుకుంటా!

శ్రీకాళహస్తికి వెళ్తున్నా.. మా నాయకుడు సాయిని పోలీసోళ్ళు కొట్టారు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడా అబ్బాయి.. ప్రజాస్వామ్యంలో హక్కది.. మీరెంత పోలీసు అధికారులైనా కావచ్చు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని కొట్టే హక్కు ఏ పోలీసు అధికారికీ లేదు.. మేం మాట్లాడతాం.. నేనే స్వయంగా కాళహస్తికి వస్తున్నా.. అక్కడే తేల్చుకుంటాం.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మా వాడిని కొడితే నన్ను కొట్టినట్టే.. వస్తా..

- తణుకులో గురువారం పవన్‌ కళ్యాణ్

Updated Date - 2023-07-14T16:22:45+05:30 IST