Chintakayala Vijay: చింతకాయల విజయ్‌కు మళ్లీ సీఐడీ నోటీసు
ABN , First Publish Date - 2023-03-25T21:15:05+05:30 IST
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కు నోటీసు
నర్సీపట్నం: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కు నోటీసు ఇచ్చేందుకు రాజమండ్రి (Rajahmundry) సీఐడీ అధికారులు శనివారం ఉదయం నర్సీపట్నం వచ్చారు. అయితే ఆ సమయంలో విజయ్ ఇంటి వద్ద లేకపోవడంతో అయ్యన్నపాత్రుడు సంతకం చేసి నోటీసు తీసుకున్నారు. క్రైమ్ నంబరు 64/2022 కేసులో విచారణ నిమిత్తం ఈనెల 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు మంగళగిరి (Mangalagiri)లోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శివపురంలో చింతకాయల విజయ్ (Chintakayala Vijay), రాజేశ్ పేరిట ఇల్లు ఉంది. అయితే భవనం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఇరిగేషన్ స్థలంలో ఉందని పేర్కొంటూ గత ఏడాది జూన్ 19న ఇరిగేషన్, మునిసిపల్, రెవెన్యూ అధికారులు దానిని కూల్చివేశారు. ఆ స్థలానికి సంబంధించి తాము ఇరిగేషన్ ఉన్నతాధికారి అనుమతి తీసుకున్నామని అయ్యన్న కుటుంబ సభ్యులు పేర్కొనగా...ఆ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఫిర్యాదు అందింది. ఈ మేరకు నవంబరు 2వ తేదీన సీఐడీ అధికారులు కేసు (క్రైమ్ నంబరు 64/2022) నమోదుచేసి ఏ-1గా చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏ-2గా విజయ్, ఏ-3గా రాజేశ్ పేర్లను పేర్కొన్నారు.
నవంబరు మూడో తేదీన తెల్లవారుజామున సీఐడీ అధికారులు, పోలీసులు నర్సీపట్నంలోని శివపురంలో వున్న విజయ్, రాజేశ్‌ల ఇంటికి వచ్చారు. అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌ను బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అదేరోజు రాత్రి వారిద్దరికీ కోర్టు బెయిల్ మంజూరుచేసి విడుదల చేసింది. ఈ కేసులోనే విచారణ నిమిత్తం హాజరుకావలసిందిగా ఏ-2గా ఉన్న విజయ్‌కు 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చేందుకురాజమండ్రి నుంచి శనివారం సీఐడీ అధికారులు నర్సీపట్నం వచ్చారు. విజయ్ ఇంట్లో లేక పోవడంతో సదరు అధికారులు అయ్యన్నపాత్రుడుకు అందజేశారు. నోటీసులో 28న విచారణకు హాజరు కావాలని పేర్కొనడంపై అయ్యన్నపాత్రుడు అభ్యంతరం తెలిపారు. విజయ్ ఊళ్లో లేడని, ఇంత తక్కువ సమయంలో విచారణకు హాజరు కావడం వీలుపడదని సమయం ఇవ్వాలని కోరారు. దీంతో సీఐడీ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి 31వ తేదీన విచారణకు హాజరు కావలని పేర్కొన్నారు.