డ్వాక్రా సభ్యులకు కుచ్చుటోపీ!

ABN , First Publish Date - 2023-06-25T01:25:36+05:30 IST

డ్వాక్రా సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న క్షేత్రస్థాయి సిబ్బంది లక్షల రూపాయల మేర దోపిడీ చేసేస్తున్నారు.

డ్వాక్రా సభ్యులకు కుచ్చుటోపీ!
పేరూరు సచివాలయం వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డ్వాక్రా మహిళలు విచారణ చేస్తున్న స్ర్తీనిధి ఏజీఎం ప్రసన్నలక్ష్మి, హాజరైన డ్వాక్రా సభ్యులు.. యానిమేటర్‌ నెల్లి కనకదుర్గ

పేరూరులోని 21సంఘాల పరిధిలో నిధుల స్వాహా

రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు స్కామ్‌

స్ర్తీనిధి సొమ్ములు రూ.16.80 లక్షలు స్వాహా.. నిర్థారణ

యానిమేటర్‌తోపాటు కొందరు సిబ్బంది ప్రమేయం

మొన్న బండారులంక.. నేడు పేరూరు..

కొనసాగుతున్న డ్వాక్రా సంఘాల్లో నిధుల దోపిడీ

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

డ్వాక్రా సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న క్షేత్రస్థాయి సిబ్బంది లక్షల రూపాయల మేర దోపిడీ చేసేస్తున్నారు. ఒక యానిమేటర్‌ ఏకంగా అరకోటికి పైగానే తన పరిధిలో ఉన్న గ్రూపు సభ్యులకు కుచ్చుటోపీ పెట్టింది. అధికారికంగా స్ర్తీనిధికి చెందిన రూ. 16.80 లక్షలు సొమ్ములు ఒక యానిమేటర్‌ స్వాహాచేసినట్టు ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఒక స్ర్తీనిధే కాదు ఆమె పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులు నెలవారీ చెల్లించే రుణాల నగదు మొత్తం, వారికి సంబంధించి బ్యాంకులో ఉండాల్సిన పొదుపు నిధులను కొందరు సిబ్బంది సహకారంతో స్వాహా చేసినట్టు అమలాపురం రూరల్‌ మండలం పేరూరు గ్రామ పంచాయతీలో శనివారం వెలుగు చూసింది. ఆమె గత కొన్ని నెలల నుంచి వ్యూహాత్మకంగా స్వాహాచేసిన సొమ్ముల్లో కొందరు సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు ప్రత్యక్షంగా ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. పేరూరులోని చింతలమెరక, తోట్లపాలెం, రజకులపేట పరిధిలోని 38 డ్వాక్రా సంఘాల పరిధిలో యానిమేటర్‌గా పనిచేస్తున్న నెల్లి కనకదుర్గ ఈ భారీ స్కామ్‌కు పాల్పడినట్టు సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఆమె చేతిలో మోసపోయామని పెద్ద సంఖ్యలో మహిళలు పం చాయతీ కార్యాలయం దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు. ఇటీవలే రూర ల్‌ మండలంలోని బండారులంక క్లస్టర్‌ పరిధిలో సీసీ జ్యోతి రూ.11.70 లక్షలు స్వాహా చేసిన వ్యవహారంపై చేస్తున్న విచా రణలో భాగంగా పేరూరు ఘటన వెలుగు చూసిం ది. పేరూరులో ఒక్క యానిమేటర్‌ పరిధిలోనే రూ. 50 లక్షల నుంచి రూ.70 లక్షల మేర దుర్వినియో గం జరిగినా ఉన్నతస్థాయి సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించడం వెనుక ఈ స్కాముల్లో వారి ప్రమే యం కూడా ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

స్ర్తీనిధి స్వాహాపై విచారణ..

క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ అయిన లక్ష్మి గత నాలుగు రోజులుగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. 38 డ్వాక్రా సంఘాలకుగాను 21 సంఘాల్లో స్ర్తీనిధి సొమ్ములు రూ.16.80 లక్షలు స్వాహా చేసినట్టు గుర్తించింది. స్ర్తీనిఽధి సొమ్ములు గోల్‌మాల్‌ కావడంతో డ్వాక్రా మహిళా సం ఘాల సభ్యులు కొంకాపల్లిలో ఉన్న యూనియన్‌ బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. అసలు మా పొదుపు సొమ్ములు ఉన్నాయా, నెలవారీ చెల్లింపులు జరు గుతున్నాయా అని సిబ్బందిని ప్రశ్నించగా వారి నుంచి సరైన సమాధానం రాక పోవడంతో మహిళలంతా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దాంతో స్ర్తీనిధి ఏజీఎం ప్రసన్నలక్ష్మి, ఏపీఎం రమణలు అక్కడకు చేరుకున్నారు. సర్పంచ్‌ దాసరి అరుణ, ఎంపీటీసీ చొల్లంగి సుబ్బరామ్‌ల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించారు. అప్పగికే యానిమేటర్‌ కనకదుర్గను పంచాయతీ వద్దకు రప్పించారు. స్ర్తీనిధి సొమ్ముల్లో రూ.2 లక్షలు సీసీ లక్ష్మికి ఇచ్చానని, నేను సీసీ పాయింట్‌లో సిబ్బంది వల్ల నష్టపోయానని యానిమేటర్‌ దుర్గ బోరున విలపిస్తూ తెలిపింది. అయితే మూడు నెలలుగా జీతాలు లేక పోవడంతో తాను అప్పు అడగ్గా రూ.20 వేలు ఇచ్చిందని, ఆ మొత్తాన్ని కూడా ఇటీవల బ్యాంకు రుణం కింద ఆమె చెప్పినట్టు చెల్లించినట్టు సీసీ చెప్పారు. బండారులంక క్లస్టర్‌ వ్యవహారం బయటపడినప్పుడే ఉన్నతాధికారులతో యాని మేటర్ల సమావేశం నిర్వహించాం. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే చెప్పా లని చెప్పినప్పుడు నువ్వెందుకు ఈ విషయం చెప్పలేదని ఏజీఎం ప్రసన్నలక్ష్మి ప్రశ్నించారు. స్వాహా చేసిన స్ర్తీనిధి సొమ్ములను ఎప్పట్లోగా చెల్లిస్తావో అందరి ముందు చెప్పాలని ఆమె పేర్కొన్నారు. దాంతో 15 రోజుల వ్యవధిలో ఆ సొమ్ములను తిరిగి చెల్లించేందుకు అంగీకరిస్తూ దుర్గ ఒక లేఖ రాసి ఇచ్చారు.

మా పొదుపు మాటేమిటి..

ఎంతో కష్టపడి దాచుకున్న పొదుపు సొమ్ములు ఏమైపోయాయి, బ్యాంకుకు నెలవారీ చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి ఒక్కో సంఘం నుంచి లక్షలాది రూపాయలను యానిమేటర్‌ స్వాహా చేసింది, వాటి మాటేమిటని మహిళలు అధికారులను నిలదీశారు. అయితే తాను స్ర్తీనిధికి సంబంధించి మాత్రమే చెప్పగలనని మిగిలిన వ్యవహారాలు సంబంధిత బ్యాంకులు చూసుకోవాలని ఏజీఎం ప్రసన్నలక్ష్మి సూచించారు. ఈనెల 27న బ్యాంకుకు వెళ్లి ఆయా వివ రాలను చూసుకునే ఏర్పాటుచేస్తామని చెప్పారు. అయితే తాము చెల్లించిన మొత్తాలకు కొన్ని సంఘాలకు సంబంధించి అసలు రశీదులే ఇవ్వకపోగా మరి కొన్ని సంఘాలకు బ్యాంకు ఓచర్లను ఇచ్చిన వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. దాంతో తాను ఇచ్చిన ఓచర్లకు సంబంధించి మాత్రమే లెక్కలు చెప్పగలనని యానిమేటర్‌ దుర్గ పేర్కొనడంతో సభ్యులు మండిపడ్డారు. తమ సంఘాల నుంచి తాము చూసుకున్న లెక్కల ప్రకారం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు మోసపోయినట్టు బాధిత మహిళలు వివరించారు. మీరు ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టి ఇచ్చేస్తే ఇలాగే ఉంటుందని మీ బయో మెట్రిక్‌ వేయకుండా పొదుపు ఎలా తీసుకుంటుందని ఏజీఎం ప్రశ్నించారు. తమకు మాయమాటలు చెప్పి రుణమాఫీ కోసమని, మరో కారణం చెప్పో మా చేత సంతకాలు చేయించుకుంటే తాము ఏం చేయగలమని డ్వాక్రా సభ్యులు గట్టిగా ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని మహిళలు వేడుకున్నారు.

Updated Date - 2023-06-25T01:25:36+05:30 IST

News Hub