పుట్టగొడుగుల్లా..

ABN , First Publish Date - 2023-02-15T01:45:02+05:30 IST

మెడికల్‌ ల్యాబ్‌ల్లో రక్త, ఇతర పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ఎక్కడా అమలు చేయకుండా కొన్ని ల్యాబ్‌ల యజమానులు దారుణంగా దోచేస్తున్నారని ఇటీవల ఆరోపణలు వినవస్తున్నాయి.రూ.350లకు చేయాల్సిన లిపిడ్‌ ప్రొఫైల్‌కు కొన్ని ల్యాబ్‌ల్లో రూ.500 వరకూ తీసుకుంటున్నారని, హెచ్‌ఐవీ కిట్‌ రూ.75 అయితే రూ.300 వరకూ వసూలు చేస్తున్నారని పలువురు రోగులు, వారి బంధువులు వాపోతున్నారు.

పుట్టగొడుగుల్లా..

జిల్లావ్యాప్తంగా మెడికల్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు (ల్యాబ్‌లు ) విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. కనీస నిబంధనలు, పూర్తి స్థాయి అనుమతి పత్రాలు, అర్హతా ప్రమాణాలు పాటించకుండానే చాలా మంది ల్యాబ్‌లు నిర్వహిస్తూ రోగులను పీల్చిపిప్పిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్‌ ల్యాబ్‌లపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఈ విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెడికల్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేయడానికి ఏర్పాటైన ప్రత్యేక కమిటీలు సైతం మొక్కుబడిగా పనిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో మెడికల్‌ ల్యాబ్‌ల పరిస్థితి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఉంది. వివిధ టెస్టులకు ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని రోగులు వాపోతున్నారు.

ఇష్టారాజ్యంగా మెడికల్‌ ల్యాబ్‌ల ఏర్పాటు ఠ నిబంధనలన్నీ గాలికి..

రోగుల నుంచి నిలువుదోపిడీ ఠ పట్టించుకోని వైద్యఆరోగ్యశాఖ

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 14 : మెడికల్‌ ల్యాబ్‌ల్లో రక్త, ఇతర పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ఎక్కడా అమలు చేయకుండా కొన్ని ల్యాబ్‌ల యజమానులు దారుణంగా దోచేస్తున్నారని ఇటీవల ఆరోపణలు వినవస్తున్నాయి.రూ.350లకు చేయాల్సిన లిపిడ్‌ ప్రొఫైల్‌కు కొన్ని ల్యాబ్‌ల్లో రూ.500 వరకూ తీసుకుంటున్నారని, హెచ్‌ఐవీ కిట్‌ రూ.75 అయితే రూ.300 వరకూ వసూలు చేస్తున్నారని పలువురు రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని ల్యాబ్‌ల్లో ఈ దోపిడీ మరీ దారుణంగా ఉంటోందని బాధితులు చెబుతు న్నారు. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం వల్లే మెడికల్‌ ల్యాబ్‌ల్లో వివిధ టెస్టుల పేరుతో జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. మెడికల్‌ ల్యాబ్‌ల్లో టెస్టుల పేరుతో సాగుతున్న దోపిడీ ఒక ఎత్తయితే, అసలు ల్యాబ్‌ల నిర్వహణలో కనీస నిబంధనలు పాటించకపోవడం ఆందోళనకరంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా 700 వరకూ ల్యాబ్‌లు ఉన్నట్టు అంచనా. వీటిలో రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్‌ ప్రాంతంలోనే ఐదు వందల వరకూ ఉంటాయని చెబుతున్నారు. వీటిలో చాలా ల్యాబ్‌లు నిబంధనలు పాటించడంలేదని, పూర్తిస్థాయి అనుమతి పత్రాలు లేకుండానే ల్యాబ్‌లు నడుపుతున్నారనే ఫిర్యాదులున్నాయి. ప్రధానంగా బయోవేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో చాలా ల్యాబ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే అర్హతలు లేనివారిని తక్కువ జీతాలిచ్చి ల్యాబ్‌ టెక్నీషియన్స్‌గా పెట్టుకోవడం, వారితోనే టెస్టులు చేయించడం వల్ల ఇలాంటి రిపోర్టులను కొందరు డాక్టర్లు పరిగణనలోకి తీసుకోవడంలేదని తెలుస్తోంది.

ల్యాబ్‌ పెట్టుకోవాలంటే ..

ల్యాబ్‌ పెట్టుకోవాలంటే అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. డీఎంఎల్‌టీ, ఎంఎస్సీ ఎంఎల్‌టీ, బీఎస్సీ ఎంఎల్‌టీ తదితర అర్హతలు కల్గిన వారు ల్యాబ్‌ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే, వివిధ శాఖల నుంచి పూర్తి స్థాయి అనుమతిపత్రాలు, తనిఖీలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే జిల్లావైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇది వచ్చిన తర్వాతే ల్యాబ్‌ను అధికారికంగా ప్రారంభించాలి. కానీ చాలామంది అన్ని అనుమతులు రాకపోయినా ఏదోలా సర్దుబాటు చేసేసి ల్యాబ్‌లను ప్రారంభిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ముందుగా మున్సిపల్‌ పర్మిషన్‌ (ట్రేడు లైసెన్సు) పొందాల్సి ఉంటుంది. పొల్యూషన్‌బోర్డు నుంచి అనుమతి సర్టిఫికెట్‌ ఉండాలి. బయోమెడికల్‌ వేస్ట్‌ రూల్స్‌ కంప్లీట్‌గా ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి అనుమతి సర్టిఫికెట్‌ ఉండాలి. అలాగే, ఎండీ పాథాలజిస్టు సర్టిఫికెట్‌ కూడా ఉండాలి. వీటితోపాటు ఫైర్‌సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఆయాశాఖల నుంచి అనుమతి సర్టిఫికెట్లన్నీ వచ్చిన తర్వాత వాటిని దరఖాస్తుతోపాటు డీఎఅండ్‌హెచ్‌వో ఆఫీసులో సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. డీఎంఅండ్‌హెచ్‌వో వీటిని పరిశీలించి, ల్యాబ్‌కు వచ్చి ఇన్‌స్పెక్షన్‌ చేసిన తర్వాత మాత్రమే అనుమతి మంజూరు సర్టిపికెట్‌ జారీ చేస్తారు. ఈ ప్రాసెస్‌ అంతా జరగడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. కానీ చాలామంది కీలకమైన కొన్ని శాఖల అనుమతులు లేకుండానే ల్యాబ్‌లు నిర్వహిస్తూ యథేచ్ఛగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ల్యాబ్‌టెస్టుల పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న చార్జీలపైనా తీవ్ర నిరసన వ్యక్త మవుతోంది. వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సి ఉంది.

Updated Date - 2023-02-15T01:45:03+05:30 IST