కంటైనర్‌ను సెట్‌ చేసి.. మూగజీవాలను కుక్కేసి!

ABN , First Publish Date - 2023-06-07T00:54:12+05:30 IST

గోవుల తరలింపునకు ప్రత్యేకంగా సెట్టింగ్‌ చేశారు.. పోలీసులకు చిక్కకుండా ఇష్టానుసారం తరలించేస్తున్నారు.. ఈ చిత్రంలో కంటైనర్‌ను చూశారా.

కంటైనర్‌ను సెట్‌ చేసి.. మూగజీవాలను కుక్కేసి!
పోలీసులు స్వాధీనం చేసుకున్న కంటైనర్‌

కొవ్వూరు, జూన్‌ 6 : గోవుల తరలింపునకు ప్రత్యేకంగా సెట్టింగ్‌ చేశారు.. పోలీసులకు చిక్కకుండా ఇష్టానుసారం తరలించేస్తున్నారు.. ఈ చిత్రంలో కంటైనర్‌ను చూశారా.. ఇదే గోవుల తరలింపునకు వినియోగించే వాహనం.. కంటైనర్‌ పైబాగాన గాలి వెలుతురు ఆడేలా సెట్టింగ్‌ చేశారు. ఆ కింద అరలు పెట్టారు. ఆ అరల్లో గోవులను పెట్టి తరలించేస్తున్నారు. ఒక వేళ పోలీసులకు అనుమానం వచ్చి కంటైనర్‌ను తెరిచి చూసినా ఏం కనబడదు. వీళ్లు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే పోలీసులకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. ఒడిసా నుంచి రాజమహేంద్రవరం గామన్‌బ్రిడ్జి మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ వైపునకు ఒక కంటైనర్‌ బయలుదేరింది. ఈ కంటైనర్‌లో గో సంతతికి చెందిన 28 ఎద్దులు, 16 గిత్తల ఉంచారు. పైకి ఏదో కార్లు తరలించే వాహనంలా ఉంది. ఎవరికి అనుమానం కూడా రాదు. కంటైనర్‌ మధ్యలో బల్లను అమర్చి కింద పైనా ఒకదానిపై ఒకటి కిక్కిరిసి కట్టి ఇరుకుగా మూగజీవాలను రవాణా చేస్తున్నారు. కనీసం తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో లేవు. కేవలం నాలుగైదు గోవులు మాత్రమే పట్టే స్థలంలో సుమారు 44 మూగజీవాలను ఉంచారు. ఈ వాహనం చూసి పోలీసులే కంగుతిన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బంధించి గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను స్థానికుల సహాయంతో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల కిందట ఒక వ్యాన్‌ పట్టుకోగా.. మంగళవారం మరో కంటైనర్‌ చిక్కింది.. అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కొవ్వూరు పట్టణానికి చెందిన యంట్రప్రగడ శ్రీనివాస్‌ (వై.కె), రాఘవేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు.ఈ మేరకు ఎస్‌ఐ డి. భూషణం కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-06-07T00:54:12+05:30 IST