Yanamala: వైసీపీ నేతల దోపిడీకి బలవుతున్నది బీసీలే...
ABN , First Publish Date - 2023-07-17T13:41:03+05:30 IST
అమరావతి: బీసీల విషయంలో సీఎం జగన్‌ది కొంగజపమని, తడిగుడ్డతో గొంతులు కోస్తూ.. తోడుగా ఉన్నాననడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: బీసీ (BC)ల విషయంలో సీఎం జగన్ (CM Jagan)ది కొంగజపమని, తడిగుడ్డతో గొంతులు కోస్తూ.. తోడుగా ఉన్నాననడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీసీల ఆస్తులు లాక్కుని వారి సమాధులపై.. జగన్ రెడ్డి అవినీతి సౌధాల నిర్మాణం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు జగన్ రెడ్డి చేసిన మేలు కన్నా వారి నుంచి దోచుకున్నదే ఎక్కువన్నారు. వైసీపీ నేతల (YCP Leaders) దోపిడీకి బలవుతున్నది బీసీలేనన్నారు.
బీసీల నుంచి 12 వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని, అర్హత ఉన్నప్పటికీ బీసీలకు సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని యనమల ఆరోపించారు. సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.75,760 కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. జనగణన కోసం చేసిన అసెంబ్లీ తీర్మానంపై జగన్ రెడ్డి నోరు మెదపడంలేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కోత కోసి 16,800 పదవులు దూరం చేశారని, రిజర్వేషన్ల విషయంలో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
బాపట్లలో బీసీ పిల్లాడిపై పెట్రోల్ పోసి తగులబెట్టినా ప్రభుత్వం స్పందించలేదని, నిన్నటికి నిన్న విజయనగరంలో కృష్ణ మాస్టారుని రాడ్లతో కొట్టి, కళ్లు పొడిచి చంపినా నోరెత్తరని యనమల మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు కొండల్ని దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. కొండెక్కిన ధరల్ని తగ్గించడంపై చూపడం లేదని దుయ్యబట్టారు. ఎఫ్ఆర్‌బీఎం నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. ధరలు పెంచి పేదల కొనుగోలు శక్తిని దెబ్బతీసి రోడ్డుపాలు చేశారని, పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటూ.. పేదల్ని నిరుపేదలుగా మారుస్తున్నారని యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.