Botsa Satyanarayana: ఒకటా.. పదిహేనా? అని కాదు
ABN , First Publish Date - 2023-03-17T02:50:51+05:30 IST
ఉద్యోగులకు జీతాలు ఒకటో తారీఖున ఇస్తామా.. 15వ తేదీన ఇస్తామా అన్నది కాదని.. అందరికీ ఇస్తున్నామా లేదా అన్నది ముఖ్యమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
జీతాలిస్తున్నామా.. లేదా? అన్నదే ముఖ్యం: బొత్స
అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు జీతాలు ఒకటో తారీఖున ఇస్తామా.. 15వ తేదీన ఇస్తామా అన్నది కాదని.. అందరికీ ఇస్తున్నామా లేదా అన్నది ముఖ్యమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘ఈ పరిస్థితులు ఈ సంవత్సరం కాదు.. గతంలోనూ ఉన్నాయి.. కాకపోతే ఒక రోజు అటూ, ఇటూ అయింది’ అని అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులని.. వాళ్లనెందుకు ఇబ్బంది పెడతామని ప్రశ్నించారు. జీతాలు వాళ్ల హక్కు.. పని చేయించుకున్న వాళ్లకి జీతమివ్వాల్సిందే.. కాదనం అని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు 1నే జీతం తీసుకుంటున్నారన్న వాదనపై స్పందిస్తూ.. తమ అకౌం ట్లు చూసుకోవచ్చని అన్నారు. ప్రజలకు కొనుగోలు శక్తి పెరగబట్టే.. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిందని, ఈ నాలుగేళ్లలో అన్నమో రామచంద్రా అన్న వాళ్లెవరూ లేరని చెప్పారు. పేదల అవసరాలను గుర్తించి బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. విద్యకు గత ప్రభుత్వం రూ.14 వేల కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్‌లో రూ.32 వేల కోట్లు ప్రతిపాదించామని తెలిపారు.